డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:40 AM
మెగా డీఎస్సీ రెండో విడత అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం స్థానిక చెరువుకొమ్ముపాలెంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. 19 మంది హాజరయ్యారు. మొదటి విడత పరిశీలనకు హాజరైన 657 మందిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు.
రెండో విడత 19 మంది అభ్యర్థులు హాజరు
నేటి నుంచి మంగళగిరిలో తుది ఎంపిక ప్రక్రియ
ఒంగోలు విద్య, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ రెండో విడత అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం స్థానిక చెరువుకొమ్ముపాలెంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. 19 మంది హాజరయ్యారు. మొదటి విడత పరిశీలనకు హాజరైన 657 మందిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు. దరఖాస్తులో వారి ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని మిగిలిన పోస్టులకు మెరిట్‌లో వారి తర్వాత ఉన్న వారిని ప్రస్తుతం పరిశీలనకు ఆహ్వానించారు. వీరి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. సాయంత్రానికి 19మంది అభ్యర్థులు రావడంతో పరిశీలనను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ 19మందిలో ఏడుగురు దివ్యాంగులు ఉన్నారు. వీరిలో నలుగురు శారీరక దివ్యాంగులు కాగా, ముగ్గురు వినికిడి లోపం ఉన్నవారు. వీరి వైకల్య ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలనకు పంపారు. వినికిడిలోపం ఉన్న వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు, శారీరక వైకల్యం వారిని ఒంగోలు రిమ్స్‌కు సిఫార్సు చేశారు. వీరు ఆయా మెడికల్ బోర్డుల ముందు వైద్య పరీక్షలకు హాజరుకావాలి. మెడికల్ బోర్డు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలను డీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డీఎస్సీ రెండు విడతల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడంతో బుధవారం నుంచి మంగళగిరిలోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.