Share News

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:45 AM

డీఎస్సీలో మెరిట్‌ సాధించి ఎంపిక జోన్‌లో నిలిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌ యాజమాన్యాల్లో మొత్తం 629 పోస్టులకు 652 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

652 మంది అభ్యర్థులు హాజరు

ఒంగోలు విద్య, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీలో మెరిట్‌ సాధించి ఎంపిక జోన్‌లో నిలిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌ యాజమాన్యాల్లో మొత్తం 629 పోస్టులకు 652 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మొదటి రోజైన గురువారం 568 మందిని పరిశీలనకు పిలవగా 12 మంది గైర్హాజరయ్యారు. వీరిలో కొందరు సమాచారం లోపం వల్ల హాజరు కాలేకపోయారు. దీంతో వారందరికీ డీఈవో కార్యాలయం నుంచి అధికారులు ఫోన్‌ చేశారు. వీరిలో తొమ్మిది మంది శుక్రవారం పరిశీలనకు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు ఇప్పటికే వేరే ఉద్యోగాల్లో స్థిరపడిపోవడంతో వారు రామని తెలియజేస్తూ డీఈవోకు అన్‌ విల్లింగ్‌ లెటర్లు పంపారు. మరో ఇద్దరికి సకాలంలో బీఈడీ సర్టిఫికెట్లు రాకపోవడంతో వారిని అనర్హులుగా ప్రకటించారు. దీంతో మొదటిరోజు 568 మందిలో 563 మంది సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు పరిశీలన కొనసాగింది. రెండో రోజైన శుక్రవారం 89 మంది అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలిచారు. వీరిలో కొందరు హాజరుకాకపోవడంతో అధికారులు వారికి కూడా ఫోన్లు చేసి పిలిచారు సాయంత్రానికి మొత్తం 89మంది వచ్చారు. దీంతో రెండు రోజుల్లో కలిపి 652 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు అయింది. కార్యక్రమాన్ని డీఆర్వో ఓబులేషు శుక్రవారం పరిశీలించారు.

దివ్యాంగులకు వైద్య పరీక్షలు

దివ్యాంగుల కోటాలో మెరిట్‌ జోన్‌లో ఉన్న 20మంది అభ్యర్థులు గురు, శుక్రవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. విద్యార్హతలపరంగా అన్నీ సక్రమంగా ఉన్న వీరికి మెడికల్‌ బోర్డు వైకల్యాన్ని ధ్రువీకరిస్తేనేఉద్యోగాలు ఇస్తారు. దీని కోసం వీరు మెడికల్‌ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంది. వీరిలో శారీరక వైకల్యం ఉన్నవారు నలుగురు, వినికిడిలోపం ఉన్నవారు 10 మంది, దృష్టిలోపం వారు ఆరుగురు ఉన్నారు. వీరిలో శారీరక వైకల్యం వారు, దృష్టిలోపం ఉన్నవారు ఒంగోలు రిమ్స్‌ సూపరింటెండెంట్‌, వినికిడి లోపం ఉన్నవారు విశాఖపట్నంలోని ఈఎన్‌టీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ముందు హాజరై తమ సర్టిఫికెట్లకు ధ్రువీకరణ తీసుకురావాలని డీఈవో కిరణ్‌కుమార్‌ కోరారు. మొత్తంగా రెండు రోజుల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా జరిగింది.

Updated Date - Aug 30 , 2025 | 02:45 AM