వచ్చే ఏడాది ఆగస్టుకు వెలిగొండ నీరు
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:30 AM
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టులో కీలకమైన 2వ సొరంగం పనుల పురోగతిని ఆయన శుక్రవారం పరిశీలించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులు పనుల వివరాలను కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో కలెక్టర్ బృందం 2వ సొరంగం అంతర్భాగం లోపలికి వెళ్లి వచ్చారు.
ప్రాజెక్ట్ పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై చర్యలు
పనులను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు
పెద్దదోర్నాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టులో కీలకమైన 2వ సొరంగం పనుల పురోగతిని ఆయన శుక్రవారం పరిశీలించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులు పనుల వివరాలను కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో కలెక్టర్ బృందం 2వ సొరంగం అంతర్భాగం లోపలికి వెళ్లి వచ్చారు. తదనంతరం గంటవానిపల్లె చెరువు సమీపంలో ఫీడర్ కెనాల్‌పై నిర్మిస్త్తున్న బ్రిడ్జిని పరిశీలించారు. అదే క్రమంలో గంటవానిపల్లె గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తీగలేరు వాగునుదాటాల్సిన క్రమంలో వరదనీరు వచ్చినప్పుడు రాకపోకలు నిలిచిపోతాయని ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుకలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో అక్కడ వాగును పరిశీలించారు. అనంతరం వెలిగొండ విశ్రాంతి భవనంలో విలేకరులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. మొదటి సొరంగం 95శాతం, రెండో సొరంగంలో 25 శాతం లైనింగ్ పనులతో పాటు సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మొదటి దశలో భాగంగా 15లక్షల మంది ప్రజలకు తాగునీరు, 1.90లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 21 కిలోమీటర్ల పొడవున్న ఫీడర్ కెనాల్ పెండింగ్ పనులకుగాను రూ.460కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. త్వరలోనే పెండింగ్ పనులన్నీ ప్రారంభించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి, సత్యనారాయణ, సీతారామిరెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఉన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్‌ఈ సలీమ్, తహసీల్దారు అశోక్ కుమార్‌రెడ్డి, ఎంపీడీవో నాసర్‌రెడ్డి, ప్రాజెక్టు మెగా ప్రతినిధి ఇన్‌చార్జి సతీష్‌బాబు, టీడీపీ నాయకులు సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్ రెడ్డి, షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, కె.సుబ్బారెడ్డి, జనసేన నేత మురళి పాల్గొన్నారు.