Share News

వచ్చే ఏడాది వెలిగొండ నీరు

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:30 AM

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాంటి అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తెస్తామన్నారు. జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల్లో కరువు అధికంగా ఉంటుందని.. దానిని పారద్రోలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా వెలిగొండ నీరు ఇస్తామని మరోసారి ప్రకటించారు.

వచ్చే ఏడాది వెలిగొండ నీరు
సభకు హాజరైన అశేష ప్రజానీకం (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

మరోసారి స్పష్టత ఇచ్చిన సీఎం

వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధపెట్టినట్లు వెల్లడి

శ్రీశైలం నుంచే కాక గోదావరి నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తెస్తానని చంద్రబాబు హామీ

పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభం

17 జిల్లాల్లో మరో 49 పార్కులు కూడా..

జిల్లాలో మూడు చోట్ల శంకుస్థాపనలు

వైకుంఠపాళిలో పడకుండా అభివృద్ధికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి

కనిగిరి కనకపట్నంగా మారబోతుందని వ్యాఖ్య

ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పనితీరుకు కితాబు

పెద్దఎత్తున తరలివచ్చిన జనం

ఆద్యంతం కోలాహలంగా సాగిన కార్యక్రమం

తక్కువ సమయంలోనూ ఏర్పాట్లలో సక్సెస్‌

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాంటి అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, నీళ్లు తెస్తామన్నారు. జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల్లో కరువు అధికంగా ఉంటుందని.. దానిని పారద్రోలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా వెలిగొండ నీరు ఇస్తామని మరోసారి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టగా సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం 50 పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాటిని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కనిగిరి నియోజక వర్గంలోని పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కును సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ప్రారంభించారు. 7 జిల్లాల్లోని మరో 49 పార్కులకు పర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీరు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అందుకే జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు నీటి కోసం 30ఏళ్ల నాడు చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టును తానే పూర్తిచేస్తానన్నారు. వచ్చే ఏడాదికి ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఇస్తామని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధపెట్టామన్నారు కనిగిరి ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయని, గతంలో రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటుకు అవకాశం వస్తే ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి చొరవ చూపారని, దీంతో తొలిప్లాంటు కనిగిరి ప్రాంతానికి వచ్చిందన్నారు. ప్రజాప్రతినిధులు అలా చొరవ చూపితే అభివృద్ధి వేగవంతమవుతుందని, ఆ విషయంలో ఎమ్మెల్యే ఉగ్ర చొరవను అభినందిస్తున్నా నన్నారు.

కనిగిరి కనకపట్నం కావడం ఖాయం

లింగన్నపాలెం ఎంఎస్‌ఎంఈ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే హైవేలు దగ్గర్లో ఉంటాయని చంద్రబాబు అన్నారు. పామూరు రైల్వేస్టేషన్‌, రామాయపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు సులువవుతాయన్నారు. ఇందాక మీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి కనకపట్నంగా మారుతుందని ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారని, అలాంటి పరిస్థితి మీ ద్వారా కలుగుతుందని తనకు చెప్పారన్నారు. నిజంగా కనిగిరి కనకపట్నం కాబోతుందన్నారు. వెలిగొండ నీరు, పరిశ్రమల ఏర్పాటు, కొత్త రైల్వేలైన్‌, జాతీయ రహదారుల ద్వారా ఉపాధి మార్గాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. కులం, మతం చూడకుండా అభివృద్ధికి అండగా ఉంటే అది మరింత సాధ్యమవుతుందన్నారు. గతంలో వైకుంఠపాళి ఆట ఆడారని, దానివల్ల అభివృద్ధి ఆగిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి ఉంటే వెలిగొండ నీరు 2020కే వచ్చేవని, పరిశ్రమల ఏర్పాటు జరిగి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేదన్నారు. ఈ ప్రాంతంలో కరువుతో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి స్ధిరపడిన వారు తిరిగి ఇక్కడికి వచ్చి ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు.

ఆసాంతం.. ఉత్సాహంగా..

సీఎం సభకు కనిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. సుమారు మూడున్నర వేలమందికి వీలుగా షెడ్‌ ఏర్పాటు చేయగా అంతకు రెట్టింపు సంఖ్యలో పాల్గొన్నట్లు సమాచారం. మహిళలు కూడా అధికసంఖ్యలో హాజరయ్యారు. సభ ఆసాంతం హుషారుగా సాగడంతోపాటు ఆ ప్రాంతానికి చేసిన పనులకు సీఎంకు కృతజ్ఞతలు చెప్తూ ప్లకార్డులను ప్రదర్శించి మరింత ఉత్సాహంగా కనిపించారు.

ఆకట్టుకున్న ఉగ్ర ప్రసంగం

తొలుత ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కొత్త కోరికల జోలికి పోకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలను వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. వాటి వల్ల తమప్రాంతానికి మేలు జరిగిందని ప్రజల చేత చెప్పించారు. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు నిమ్జ్‌, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేమార్గం కోసం రూ.24 కోట్లు మంజూరు, కనిగిరి పట్టణంలో తాగునీటి కోసం రూ.173కోట్లు, పదివేల కొళాయిల మంజూరు, నియోజకవర్గానికి జేజేఎం కింద రూ.250 కోట్లు మంజూరు, రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటు, తాజాగా ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రస్తావిస్తూ అందుకు ప్రజల చేత హర్షధ్వానాలతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ట్రిపుల్‌ ఐటీ, ఒంగోలుకు వెళ్లకుండా ఇక్కడే ఏర్పాటయ్యేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. త్వరలో దాన్ని నిర్మించాలని కోరారు.

సీఎంకు ఘనస్వాగతం

సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, డీసీసీబీ చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లోనే విస్తృత ఏర్పాట్లు

సీఎం పర్యటన సమాచారం వచ్చినప్పటి నుంచి రెండు రోజుల వ్యవధిలోనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జిల్లా అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎస్పీ హర్షవర్థన్‌రాజు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేయగా కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. ఉదయం 11.35కు వచ్చిన చంద్రబాబు తిరిగి మధ్యాహ్నం 1.45కు హెలికాప్టర్‌లో వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఇదేసమయంలో జిల్లాలో మూడుచోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు జరిగాయి. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో అక్కడి ఎమ్యెల్యే బీఎన్‌.విజయకుమార్‌ పాల్గొన్నారు. అలాగే వైపాలెం మండలం గంగపాలెం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు, కొండపి మండలం నెన్నూరుపాడు ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 01:30 AM