Share News

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:34 PM

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటివరకూ అందుబాటులో ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతి కూరలోనూ రుచి కోసం వినియోగించే టమాటా 25 కిలోలు బాక్స్‌ రూ.1000 ధర పలుకుతోంది.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

టమాటా బాక్స్‌ రూ.1000

కిలో మునగ కాయలు వందరూపాయలు

మార్కెట్‌కు తగ్గిన దిగుమతులు

మార్టూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మొన్నటివరకూ అందుబాటులో ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. ప్రతి కూరలోనూ రుచి కోసం వినియోగించే టమాటా 25 కిలోలు బాక్స్‌ రూ.1000 ధర పలుకుతోంది. అంటే హోల్‌సేల్‌గా కిలో రూ.40 కాగా, చిల్లరగా కిలో ధర రూ.50 పలుకుతోంది. ఇక మార్కెట్‌ నుంచిటమాటా బహిరంగ మార్కెట్‌లోకి, గ్రామాలలో వీధులలోకి వచ్చిన తర్వాత కిలో రూ.50 నుంచి రూ.60లకు పైగానే ధర ఉంది. మార్టూరులోని పచ్చిమిర్చి కూరగాయల మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రాంతంలో టమాటా సాగు చాలా తక్కువ కావడంతో, మార్కెట్‌లోని వ్యాపారులు అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, డోన్‌, కర్నాటకలోని చంతామణి, కోలారు తదితర ప్రాంతాలు నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇటీవల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం, కేవలం అనంతపురం, మదనపల్లి, చిత్తూరు జిల్లాల నుంచి టమాటాను దిగుమతి చేసుకోవడంతో డిమాండు పెరిగింది. గతంలో రోజుకు 1200 బాక్స్‌లు మార్కెట్‌కు రాగా, వారం రోజుల నుండి కేవలం 800 బాక్స్‌లు మాత్రమే వస్తున్నాయి. వారం రోజుల క్రితం బాక్స్‌ ధర రూ.500 ఉండగా, ప్రస్తుతం ధర రెట్టింపు పలుకుతోంది. అదేవిధంగా మునగ కాయలు స్థానికంగా దిగుబడి లేకపోవడంతో, చెన్నై నుంచి వస్తున్నాయి. అవి కూడా సక్రమంగా రావడంలేదు. ప్రస్తుతానికి కిలో మునగ వంద రూపాయలు ధర పలుకుతోంది. అవి కూడా మార్కెట్‌లో లభించడం లేదు. నాలుగురోజుల క్రితం ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కూరగాయలు పంటలు దెబ్బతినడంతో, ప్రస్తుతం మార్కెట్‌కు కూరగాయలు చాలా తక్కువగా వస్తున్నాయి. అయ్యప్ప, వెంకన్న, ఆంజనేయ స్వామి మాలధారులకు వివిధ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు పెరగడంతో కూరగాయలకు మరింత డిమాండు పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు మిరప కాయలు కోతలు జరగకపోవడంతో, ప్రస్తుతం రైతులందరూ మిరప కోస్తుండటంతో, దిగుబడి పెరిగి, మిరప ధర కిలో రూ.20 పలకడం విశేషం.

మార్టూరు మార్కెట్‌లో ధరలు

టమోటాలు రూ.40

బంగాళదుంపలు రూ.40

బెండ రూ.40

దొండ రూ.50

వంకాయ రూ.40

బీర రూ.40

కాకర రూ.50

క్యాప్సికం రూ.80

క్యారెట్‌ రూ.70

కీరదోస రూ.40

Updated Date - Oct 27 , 2025 | 11:34 PM