Share News

మాస్‌కాపీయింగ్‌కు ఒప్పుకోలేదని వీరంగం

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:45 PM

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్‌ కాపియింగ్‌కు ఒప్పుకోలేదని ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయిని (ఎస్జీటీ) దురుసుగా ప్రవర్తించారు. ఈఘటన మంగళవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో చోటుచేసుకుంది.

మాస్‌కాపీయింగ్‌కు ఒప్పుకోలేదని వీరంగం

నివ్వెరపోయిన ఇన్విజిలేటర్‌, ప్రిన్సిపాల్‌

కనిగిరి డిగ్రీ కాలేజిలోని పరీక్షా కేంద్రంలో ఘటన

కనిగిరి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షల్లో మాస్‌ కాపియింగ్‌కు ఒప్పుకోలేదని ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయిని (ఎస్జీటీ) దురుసుగా ప్రవర్తించారు. ఈఘటన మంగళవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈనెల 20వ తేదీ నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. కనిగిరి ప్రభుత్వ కళాశాల కేంద్రంలో దాదాపు 125 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

మంగళవారం జరిగిన పరీక్షల్లో ఓ ఉపాధ్యాయిని పరీక్ష జరిగే సబ్జెక్ట్‌ను కేంద్రంలోపలకు తెచ్చుకుని జవాబులు రాస్తున్నారు. దీనిని అడ్డుకున్న ఇన్విజిలేటర్‌పై, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉషారాణిపై దురుసుగా ప్రవర్తించారు. పరీక్షా కేంద్రం వద్దకు తమ బంధువులను పిలిపించి నానారభస చేశారు. పరీక్షల నిర్వహణకు ఆటంకం కల్గించటం బాధాకరంగా ఉందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు మహిళా ఉపాధ్యాయిని దురుసుగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి ఆ మహిళా ఉపాధ్యాయినిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దుర్భాషలాడటం ఎంతో బాధగా ఉంది

డాక్టర్‌ ఉషారాణి, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌

ఓ మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయిని అయి ఉండి మాస్‌ కాపీయింగ్‌ను సమర్థించకుండా అడ్డుకున్నందుకు దుర్భాషలాడటమే కాకుండా పరీక్షా కేంద్రం వద్దకు బంధువులను పిలిపించి వీరంగం చేశారు. పరీక్ష రాసేవారికి ఇబ్బంది కల్గుతుంది, కేకలు వేయవద్దు బయటికి రమ్మని పిలిచినా వినలేదు. ఓ ఉపాధ్యాయిని ఇలా ప్రవర్తించటం సిగ్గుగా ఉంది. ఇలాంటి వారు విద్యార్థులకు ఎలా పాఠాలు చెప్తారు. ఈ వైఖరి సమంజసం కాదు. ఓపెన్‌ పరీక్షలంటే మాస్‌ కాపీయింగ్‌ చేయటం కాదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తాం.

పరీక్షలు జరపాలంటేనే...

మాలకొండయ్య, ఏఓయూ కోఆర్డినేటర్‌

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో ఈనెల 20వ తేది నుంచి ఏఓయూ డిగ్రీ మూడవ సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయ. ఈ పరీక్షల మొదటిరోజు నుంచి మహిళ ఉపాధ్యాయిని మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుంది. మంగళవారం ఏకంగా పరీక్షకు సంబంధించిన బుక్‌లెట్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకువచ్చి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడింది. దీనిని ఇన్విజిలేటర్‌ అడ్డుకున్నందుకు ఇష్టానుసారంగా మాట్లాడింది. అంతేకాకుండా డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌ జె.ఉషారాణి పై కూడా దురుసుగా వ్యవహరిస్తూ దుర్భాషలాడింది. పైగా సదరు మహిళ తమ బంధువులను పిలిపించి పరీక్ష కేంద్రం వద్దకు గొడవ చేయడం సిగ్గుగా ఉంది. వారు కూడా తమను ఇష్టం వచ్చినట్లు చెప్పలేని పదాలతో దుర్భాషలాడారు. ఈ ఘటన బాధాకరం. సదరు మహిళా ఉపాధ్యాయినిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. పరీక్షలు నిర్వహించాలంటేనే భయంగా ఉంది.

Updated Date - Jun 24 , 2025 | 11:45 PM