వైభవంగా వీరభద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:18 PM
చిలుకూరివారి వంశదేవర శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం పంగులూరులో వైభవంగా జరిగింది. తెనాలికి చెందిన ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ వేములశ్రీహరి పర్యవేక్షణలో వారి రుత్విక్‌లబృందం నిర్ణీత ముహూర్తంలో యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ గావించారు.
పంగులూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): చిలుకూరివారి వంశదేవర శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం పంగులూరులో వైభవంగా జరిగింది. తెనాలికి చెందిన ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ వేములశ్రీహరి పర్యవేక్షణలో వారి రుత్విక్‌లబృందం నిర్ణీత ముహూర్తంలో యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ గావించారు. వేదపండితుల మంత్రోఛ్చారణలతో శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారు సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న నూతన ఆలయంలో కొలువుదీరారు. శాస్ర్తోక్తంగా జరిగిన ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొనేందుకు పంగులూరు,చినమల్లవరం, నక్కలపాలెం, నాగండ్ల, ఇంకొల్లు పరిసర ప్రాంతాలకు చెందిన చిలుకూరి వంశస్తులు, వారి ఆడపడుచులు, బంధుమిత్రులు వేలాదిగా తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. దాతలు సమకూర్చిన వెండికిరీటధారణలతో ప్రత్యేకాలంకరణలో శోభిల్లిన శ్రీభద్రకాళీ అమ్మవారిని, వీరభద్రస్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. దేవతామూర్తుల ప్రతిష్ఠాపన అనంతరం శాంతిహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన స్వామివారి శాంతి కల్యాణవేడుకలో చిలుకూరి వంశస్థులు సతీసమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
వేలాదిమందికి అన్నదానం
పంగులూరులో ఆదివారం జరిగిన శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన వేలాదిమంది భక్తులకు ఆలయ కమిటీ అన్నదానం ఏర్పాటుచేసింది.
పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గరటయ్య
చిలుకూరివారి వంశదేవర శ్రీభద్రకాళీసమేత వీరభద్రస్వామి ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గరటయ్య, బాచిన చెంచుప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.