Share News

గోడౌన్‌లో నిల్వ ఉన్న పలు పంట ఉత్పత్తులు

ABN , Publish Date - Nov 03 , 2025 | 10:04 PM

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. దాంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితిని రైతులు చూస్తున్నారు.

గోడౌన్‌లో నిల్వ ఉన్న పలు పంట ఉత్పత్తులు
గోడౌన్‌లో నిల్వ ఉన్న పలు పంట ఉత్పత్తులు

xతగ్గిన శనగలు, కందులు, కొర్రలు, ఉలవల రేట్లు

నష్టాలలో రైతులు, వ్యాపారులు

గిద్దలూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ ఉత్పత్తుల ధరలు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. దాంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితిని రైతులు చూస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరల కంటే రోజురోజుకు రేటు తగ్గిపోతుండడంతో నష్టాలబారిన వ్యాపారులు పడుతున్నారు. ముఖ్యం గా శనగలు, కందులు, కొర్రలు, ఉలవల రేట్లు రోజురోజుకూ తగ్గుతున్నాయి. పప్పుశనగ గత ఏడాది క్వింటా రూ.6,400 ఉండగా ఈ సీజన్‌లో పంట దిగుబడి మొదలయ్యే సమయంలో రూ.6వేలు పలికింది. ప్రస్తుతం ధరలు దిగజారి రూ.5,500 నుంచి రూ.5,700 వరకు ఉన్నది. ధరలు పెరుగుతాయని కొంతమంది రైతులు శనగలను తమ ఇళ్లల్లో, కోల్డ్‌స్టోరేజీలలో నిలువ ఉంచగా, రోజురోజుకు ధరలు తగ్గడంతో నష్టంతోపాటు కోల్డ్‌స్టోరేజీల అద్దె భారం కూడా రైతుల మెడకు చుట్టుకుంటున్నది. ఇక వ్యాపారుల విషయానికి వస్తే రూ.6వేల ధరతో కొనుగోలు చేసిన శనగలు క్వింటాకు రూ.500 దాకా తగ్గడంతో లారీ మేర స్టాక్‌ పెట్టిన వారికి సుమారు లక్ష రూపాయల మేర నష్టం వస్తున్నది. తెల్ల శనగలు గత ఏడాది రూ.10వేలు పలుకగా ఈ ఏడాది మార్చిలో పంట ఉత్పత్తి సమయంలో రూ.6,700 పలికింది. కానీ ప్రస్తుతం రూ.5,500 నుంచి రూ.5,700 ధర ఉండడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సగం మంది రైతులు గత ఏడాది ధరలను దృష్టిలో పెట్టుకుని ఆ రేటు కోసం ఎదురు చూస్తూ ధరలు ఇంకా తగ్గడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కొర్రలు గత ఏడాది రూ.3,400 పలుకగా ప్రస్తుతం రూ.2,200 నుంచి రూ.2,400 పలుకుతున్నది. గతంలో కొనుగోలు చేసిన స్టాక్‌లు కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతుండగా క్వింటాకు రూ.1000 మేర తగ్గడంతో వ్యాపారులు లబోదిబో మంటున్నారు. కందుల విషయానికి వస్తే కోత దశలో రూ.6,400 ఉండగా ప్రస్తుతం రూ.5,500 మేర ధర ఉన్నది. గత ఏడాది ఇదే సీజన్‌లో కందుల రూ.11,800 ధర పలికింది. ఆ రేట్లను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిలువ ఉంచుకోగా ధరలు రోజురోజుకూ పాతాళానికి వెళ్తుండడంతో ఆందోళనలో ఉన్నారు. రేట్లు పెరుగుతాయని 40 నుంచి 50 శాతం మేర రైతులు ముఖ్యంగా తెల్ల శనగలు, కందులను అమ్మకుండా నిలువ ఉంచుకోగా రోజురోజుకు రేట్లు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలను ప్రకటించి కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 03 , 2025 | 10:04 PM