నిరుపయోగంగా ఎత్తిపోతలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:36 AM
కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు గ్రామాలలో ఆలంకారప్రాయంగా మారాయి.
బల్లికురవ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఇప్పుడు గ్రామాలలో ఆలంకారప్రాయంగా మారాయి. కొన్నేళ్లగా స్వల్పమరమ్మతులతో పథకాలు పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటి వరకు అంటే సాగుకు నీరులేదని ఈ ఏడాది సాగర్ కాలువల ద్వారా పంటలకు ముందస్తుగా నీరు రావడంతో ఎత్తిపోతల పథకాలు పనిచేయకుంటే అయకట్టులో ఉన్న చివరి భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మండలంలోని గుంటుపల్లి, కొణిదెన, నక్కబొక్కల పాడు, ఉప్పుమాగులూరు గ్రామాలలో ప్రభుత్వ ఐడీసీ పథకం ద్వారా గతంలో ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా వేల ఎకరా ల్లో వరి, మెట్టపైర్లయిన మిర్చి, మొక్కజొన్న, జూటు, శనగ, పత్తి, పొగాకు పంటలు రైతులు గతంలో సాగు చేశారు. కొంతకాలం నుంచి ఎత్తిపోతల పథకాల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈ ఏడాది అన్ని డ్యాంలు పూర్తిస్థాయిలో నిండడంతో సాగుకు ప్రభుత్వం నీటివిడుదల చేస్తోంది. దీంతో రైతుల్లో మరలా వరిసాగును పెద్దఎత్తున సాగుచేసేలా రైతులు సిద్ధం అవుతున్నారు. కాని సాగర్ నీరు వచ్చిన ఎత్తిపోతల పథకాలు పనిచేయకుంటే పంటలు పండించడం కష్టం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటుపల్లి ఎత్తిపోతల పథకానికి 24 గంటల విద్యుత్ లైన్ మరమ్మతులకు గురైంది. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిపరిస్తే నాలుగు గ్రామాల్లోని రైతులకు పంటలకు ఎలాంటి డోకా ఉండదు. నక్కబొక్కలపాడు ఎత్తిపోతల పథకం కింద 1212 ఎకరాల అయకట్టు ఉంది. ఈ పథకానికి సంబందించి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు పగలగొట్టి తీగలను తస్కరించడంతో విద్యుత్ సరఫరా లేక ఈ పథకం కొన్నేళ్లగా నిరుపయెగంగా మారింది. ఈ పథకం ఏర్పా టుకు ప్రభుత్వం అప్పట్లో సుమారు ఏడు కోట్లను వెచ్చింది. ఇప్పుడు ఈ పథ కం రైతులకు అందని ద్రాక్షలా తయారయింది. అలానే ఉప్పుమాగులూరు గ్రామంలో ఉన్న వేణు గోపాలస్వామి ఎత్తిపోతల పథకం కింద 3300 ఎకరాల భూములకు సాగు నీరు అందాల్సి ఉంది. కాని ఈ పథకం ఇప్పుడు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. ఈ పథకం ద్వారా నాలుగు గ్రామాల రైతులకు పంటలకు నీరు అందే సౌకర్యం ఉంది. కాని గత కొంత కాలంగా మరమ్మతులకు గురైంది. గత ఏడాది దొంగలు విలువైన మోటార్లను కూడా దొంగించారు. పిచ్చి మొక్కలు నిండుకొని ఉండటంతో కొంతకాలం నుంచి ఈ పథకం పనిచేయడం లేదు. అలానే కొణిదెన గ్రామ ఎత్తిపోతల పథకానికి స్వల్ప మరమ్మతులు ఉన్నాయి. అని రైతులు అంటున్నారు. పైపులైన్ సరిగా లేదని రైతులు తెలిపారు. తక్షణమే అధికార్లు ఎత్తిపోతల పథకాలను వినియెగంలోకి తీసుకురావాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. లేకుంటే సాగర్ నీటి విడుదల జరిగిన ఎలాంటి ఉపయెగం ఉండదని వారు తెలిపారు. ఐడీసీ అధికారులు ఎత్తిపోతల పథకాలను ఇటీవల పరిశీలన చేసి నివేదికలు తయారు చేసిన ఇంతవరకు పథకాలను వినియెగంలోకి తీసుకు రాలేదని తక్షణమే అన్ని పథకాలు వినియోగంలోకి తీసుకొచ్చి ఎత్తిపోతల పథకాల వద్ద రాత్రులు వాచ్‌మెన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.