అందని హైవే పరిహారం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:34 AM
వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నూతనంగా నిర్మాణం జరుగుతున్న 167ఏ జాతీయ రహదారి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రూ.667 కోట్లు నిధులతో వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు. చిలకలూరి పేట, నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల వద్ద నకరికల్లు అడ్డరోడ్డు వరకు నిర్మాణాలుగు జరుగుతున్నాయి.

ఏళ్లుగా భూములు కోల్పోయిన రైతుల నిరీక్షణ
జిల్లాలో జోరుగు సాగుతున్న 167ఏ
జాతీయ రహదారి నిర్మాణ పనులు
ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తయ్యే అవకాశం
చీరాల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నూతనంగా నిర్మాణం జరుగుతున్న 167ఏ జాతీయ రహదారి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రూ.667 కోట్లు నిధులతో వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు. చిలకలూరి పేట, నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల వద్ద నకరికల్లు అడ్డరోడ్డు వరకు నిర్మాణాలుగు జరుగుతున్నాయి. ఈక్రమంలో బాపట్ల జిల్లాలో సుమారు 45 కిలో మీటర్లు వరకు రహదారి ఉండనుంది. ఈక్రమంలో ప్రారంభమైన జాతీయ రహదారితో తెలంగాణకు సైతం అతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంది. తద్వారా వివిధ రకాల వ్యాపారాలు సైతం కొనసాగేందుకు సులువైన మార్గం కా నుంది. అంతేకాకుండా రహదారి నిర్మాణంతో చీరాల తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది.
పరిహారం కోసం పాట్లు
ఇదిలావుంటే జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ జరిగిన సమయంలో అధిక సంఖ్యలో రైతులు వారు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను తప్పని పరిస్థితులలో నిర్మాణానికి అప్పచెప్పాల్సి వచ్చింది. అదే క్రమంలో సంబంధిత అధికారులు సైతం నష్ట పరిహారం అందించేందుకు ఆయా యజమానుల వద్ద అన్ని రకాల పత్రాలను అందుకుని ఆన్‌లైన్ చేశారు. ఈక్రమంలో రెండేళ్లు గడిచిన అనంతరం పరిహారం కొందరికి మాత్రమే అందినట్లు రైతులు చెప్తున్నారు. ఇంకా అందని వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మరోపక్క పనులు జరుగుతుండడంతో తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అధికారులు వెంటనే పరిశీలన చేసి పరిహారం అందించాలని భూ యజమానులు కోరుతున్నారు.
సుమారు ఎకరన్నర భూమి కోల్పోయాం
జాతీయ రహదారి నిర్మాణంలో నా అన్నది, నాది సుమారు ఎకరన్నర భూమి కోల్పోయాం. సాగు చేసి జీవించే భూమి కోల్పోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చింది. నేటికీ అందలేదు. అధికారులు సమస్యను పరిష్కరించాలి.
- డీ చిన్న మోషే, భూ యజమాని
పరిహారం నోటీసులకే పరిమితం
భూ సేకరణలో భాగంగా 43 సెంట్లు కోల్పోయాను. ఆ సమయంలో అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. పరిహారం మా త్రం అందలేదు. రెండేళ్లు గడుస్తున్నా మా గోడు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించాలి.
- ఏసోబు, భూ యజమాని
మూడు దఫాలుగా పరిహారం అందజేశాం
భూ సేకరణ జరగగానే యజమానులకు పరిహారానికి సంబంధించి నోటీసులు అందజేశాం. గతంలో పరిహారం ఆలస్యమైనది వాస్తవమే. కానీ కొంతకాలంగా యజమానుల ఖాతాల్లో నగదు జమ జరుగుతుంది. ఇప్పటికే మూడు దఫాల్లో పరిహారం అందజేశాం. కోర్టు వివాదాలు, అగ్రిమెంట్‌ల పరిశీలన జరుగుతున్నాయి. తప్పకుండా నిర్వాసుతు లందరికీ పరిహారం అందజేస్తాం
- గోపీకృష్ణ, తహసీల్దార్, చీరాల మండలం