Share News

కార్పొరేషన్‌లో కాక

ABN , Publish Date - May 25 , 2025 | 11:10 PM

ఒంగోలు నగర పాలక సంస్థ పాలకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మేయర్‌ గంగాడ సుజాత, కార్పొరేటర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మెజారిటీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో పరిస్థితి మేయర్‌ వర్సెస్‌ కార్పొరేటర్లుగా తయారైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, మేయర్‌తో ఆదివారం పొద్దుపోయే వరకూ వేర్వేరుగా సమావేశమయ్యారు.

కార్పొరేషన్‌లో కాక

మేయర్‌ వర్సెస్‌ కార్పొరేటర్లు

వేర్వేరుగా ఎమ్మెల్యే దామచర్ల సమావేశం

సుజాత ఏకపక్ష నిర్ణయాలు

తీసుకుంటున్నారని కార్పొరేటర్ల ఫిర్యాదు

ఆమె అవినీతి శ్రుతిమించిందంటూ ఆరోపణలు

వారు తనకు సహకరించడం లేదన్న గంగాడ

ఒంగోలు నగర పాలక సంస్థ పాలకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మేయర్‌ గంగాడ సుజాత, కార్పొరేటర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మెజారిటీ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో పరిస్థితి మేయర్‌ వర్సెస్‌ కార్పొరేటర్లుగా తయారైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, మేయర్‌తో ఆదివారం పొద్దుపోయే వరకూ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మేయర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కడంతోపాటు ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇటు అధికారులు, అటు తమను కలుపుకుపోవడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అదేసమయంలో మేయర్‌ గంగాడ సుజాత కార్పొరేటర్లు తనకు సహకరించడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వారిపైనా కొన్ని ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే జనార్దన్‌ రంగంలోకి దిగి పరిస్థితిని సరిదిద్దే ప్రక్రియను చేపట్టారు. నగరాభివృద్ధిపై కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఒంగోలు కార్పొరేషన్‌, మే 25 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గంలోవేరు కుంపట్లు ఏర్పడ్డాయి. పాలకవర్గం ఏర్పాటైన తొలిరోజు నుంచి మేయర్‌ గంగాడ సుజాతతో కలిసి నడిచిన పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు ఆమె వ్యవహార శైలి, పనితీరుపై గరంగరంగా ఉన్నారు. సుజాత అవినీతి శ్రుతిమించిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారులకు, తమకు తెలియకుండానే కొన్ని వ్యవహారాల్లో తానే నిర్ణయాలు తీసుకోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను కలిసి నగర అభివృద్ధిలో మేయర్‌ తమను కలుపుకుపోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులను ఒత్తిడికి గురి చేయడంతోపాటు పలు అంశాలలో తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మేయర్‌కు మెజారిటీ కార్పొరేటర్లు దూరం

ఒంగోలు నగర పాలక సంస్థలో 50 డివిజన్‌లు ఉండగా గతంలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీకి 43, టీడీపీకి ఆరు, జనసేనకు ఒకటి దక్కింది. దీంతో కార్పొరేషన్‌ పాలకవర్గం వైసీపీ పరమైంది. అయితే గత సాధారణ ఎన్నికల అనంతరం వైసీపీ మేయర్‌ గంగాడ సుజాతతోపాటు ఆపార్టీ కార్పొరేటర్లలో 18 మంది టీడీపీలో చేరారు. అనంతరం పరిణామాల్లో 21 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చివరికి వైసీపీకి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఇప్పటికే జనసేన కార్పొరేటర్లు మేయర్‌కు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లంతా ఆమె తీరును వ్యతిరేకించడంతోపాటు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

మేయర్‌, కార్పొరేటర్లతో దామచర్ల వేర్వేరుగా భేటీ

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆదివారం టీడీపీ కార్పొరేటర్లు, మేయర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. మొదటగా కార్పొరేటర్లతో ఆయన మాట్లాడారు. వారి అభిప్రాయాలు, కార్పొరేషన్‌లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌ను మార్చాలని ముక్తకంఠంతో కోరినట్లు సమాచారం. అందుకు తామంతా సంతకాలు చేస్తామని వెల్లడించినట్లు తెలిసింది. మేయర్‌ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ కొన్ని అంశాలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమె తన, మన అన్న తేడా లేకుండా ప్రతిదానికీ డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాము అడిగిన పలు పనులకు కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తూ అవమానిస్తున్నారని వాపోయినట్లు సమాచారం.

కార్పొరేటర్లపై మేయర్‌ ఫిర్యాదులు

కార్పొరేటర్లతో భేటీ అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మేయర్‌ గంగాడ సుజాతతో వేరుగా మాట్లాడారు. కార్పొరేటర్ల ఫిర్యాదులను ఆమె దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో మేయర్‌ తనను సమర్ధించుకుంటూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కార్పొరేటర్లు తనకు సహకరించడం లేదంటూ వారపైనా కొన్ని ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆమెతో ఎమ్మెల్యే జనార్దన్‌ మాట్లాడుతూ.. ‘నగర అభివృద్ధి జరగాలంటే సమష్టి కృషి, సహకారం అవసరం. అందరినీ కలుపుకొని వెళ్లాలి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు’ అని సూచించినట్లుగా సమాచారం.

మేయర్‌ ప్రత్యేక సమావేశాలు..!

ఇటీవల కాలంలో మేయర్‌ గంగాడ సుజాత కొందరు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. కమిషనర్‌ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులు, సమావేశాలలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో శనివారం కార్పొరేషన్‌ సెక్షన్‌ హెడ్‌లతో సమావేశం నిర్వహించిన ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్‌ అధికారులతో మేయర్‌ సమావేశం ఏర్పాటు చేసి పలు ఆదేశాలు జారీ చేయడాన్ని కూడా కార్పొరేటర్లు తప్పుబడుతున్నారు. మొత్తంగా కార్పొరేషన్‌ పాలకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు పాలకవర్గంలో మేయర్‌ మార్పులు జరగవచ్చన ప్రచారం జరుగుతోంది.


నేడు కార్పొరేషన్‌కు దామచర్ల

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆదివారం మొత్తం మేయర్‌, కార్పొరేటర్ల మధ్య వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేశారు. వేర్వేరుగా సమావేశమై వారు చెప్పిన విషయాలను ఆలకించారు. ఆతర్వాత అసలు కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది? అన్న విషయంపై ఆరా తీసిన దామచర్ల ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత టీడీపీ తరఫున గెలిచిన, కొద్దికాలం క్రితం పార్టీలో చేరిన కార్పొరేటర్లను పిలిపించుకొని మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బజారుకెక్కితే పార్టీ పరువుపోతుందని, ఈ విషయంలో తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారిని ఆదేశించారు. మేయర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, అవినీతికి వ్యవహారాలకు పాల్పడకుండా కట్టడి చేస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే హద్దులు మీరిన కొందరు కార్పొరేటర్లు కూడా పద్ధతి మార్చుకోకపోతే అవసరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. తదనంతరం ఆయన సోమవారం కార్పొరేషన్‌కు వస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. అభివృద్ధి పనులు, ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అవసరమైన సమాచారంతో సిద్ధంకావాలని అధికారులకు సూచించారు. పాలకవర్గ కాలపరిమితి ఏడాది లోపే ఉండటం, రానున్న ఆరునెలల తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉండటాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పాలకమండలిని కట్టడి చేసేందుకే దామచర్ల పరిమితమవుతారా? లేక మేయర్‌ మార్పునకు సిద్ధమవుతారా? అన్నదానిపై వచ్చేనెల మొదటి వారంలో నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

Updated Date - May 25 , 2025 | 11:10 PM