Share News

వర్సిటీ వెలవెల

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:01 PM

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జిల్లావాసి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ఆవిర్భవించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ విద్యార్థులు లేక వెలవెలబోతోంది.

వర్సిటీ వెలవెల

ఆంధ్రకేసరీ యూనివర్సిటీలో పలు కోర్సుల్లో భర్తీ కాని సీట్లు

నామమాత్రపు ప్రవేశాలతోనే కొనసాగింపు

కొన్ని విభాగాల్లో ఒక అంకె కూడా దాటని విద్యార్థుల సంఖ్య

ఒంగోలు విద్య, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జిల్లావాసి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ఆవిర్భవించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ విద్యార్థులు లేక వెలవెలబోతోంది. వర్సిటీ కళాశాలలోని మొత్తం సీట్లలో మూడో వంతు కూడా భర్తీ కావడం లేదు. ఒకప్పుడు ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ కేంద్రం విద్యార్థులతో కళకళలాడుతుండేది. అప్పట్లో ఆ కేంద్రంలో చేరేందుకు పోటీపడేవారు. అక్కడ సీట్లు రాకపోతేనే ప్రైవేటు పీజీ కళాశాలల వైపు చూసేవారు. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. ముందుగా పేరున్న ప్రైవేటు కళాశాలలవైపు మొగ్గుచూపి అక్కడ సీట్లు రాకపోతేనే యూనివర్సిటీ వైపు చూస్తున్నారు. తరగతుల నిర్వహణ కూడా నామమాత్రంగానే ఉండటంతో వర్సిటీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు.

మూడో వంతు సీట్లు భర్తీ కావట్లేదు

ఏకేయూ కళాశాలలోని మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ కళాశాలలో మొత్తం 13 విభాగాల్లో 595 సీట్లు ఉండగా 2024-25 విద్యా సంవత్సరంలో కేవలం 191 సీట్లు (32)శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ 191లో పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 118 మంది, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా 73 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో పీజీ సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 129 సీట్లు అంటే కేవలం 22శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఎంబీఏ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లోనే రెండంకెల్లో విద్యార్థులు చేరారు. మిగిలిన 10 విభాగాల్లో ఒక అంకె దాటలేదు. కొన్ని విభాగాల్లో అధ్యాపకులు, సిబ్బంది సంఖ్య కంటే విద్యార్థులే తక్కువగా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మూడు విభాగాల్లో గత సంవత్సరం ఒక విభాగంలో ఒక్కో విద్యార్థి ప్రవేశం పొందారు. ఎంఎ్‌సడబ్ల్యూ, ఎంఈడీ, స్టాటిస్టిక్స్‌లో ఒక్కొక్కరు, ఎకనామిక్స్‌, కామర్స్‌లో ఇద్దరేసి, మేఽథమేటిక్స్‌లో ముగ్గురు విద్యార్థులు చేరారు.

అంతంతమాత్రంగానే ప్రభుత్వ ప్రోత్సాహం

పీజీ కోర్సులకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉంది. యూనివర్సిటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఆక్వాకల్చర్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయడం లేదు. ఒంగోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ యూనివర్సిటీలో చేరే వారికి మొండిచెయ్యి చూపుతోంది. ఈ మూడు కోర్సులకు ఏకేయూ స్వయంగా నిధులను సమకూర్చుకోవాలని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకొంది.

Updated Date - Oct 05 , 2025 | 11:02 PM