అపరిశుభ్రంగా గ్రామాలు -ప్రమాదభరితంగా వీధులు
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:30 AM
కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కురుస్తున్న ఎడతెరపిలేని నాన్పుడు వానతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
చీరాల, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి) : కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కురుస్తున్న ఎడతెరపిలేని నాన్పుడు వానతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం నీళ్లు నిండి కాలువలను తలపిస్తు న్నాయి. అంతేకాకుండా కొన్ని రోడ్లు మురుగు నీటితో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. మరొకొన్ని రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతాల్లో వాహనదారులు పట్టుతప్పి కింద పడుతున్నారు. గతంలో పాలకులు మరమ్మతులు చేపట్టిన అది క్షేత్రస్థాయిలో అమలు జరగలేదు. కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టినా, సేవలు పారదర్శకంగా లేకపోవడంలో నీళ్లుభారీగా నిలుస్తు న్నాయి. ఈపూరుపాలెం వద్ద నుంచి పలు ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగానే ఉన్నాయి. దీంతో నిత్యం చీరాల నుంచి బాపట్ల, గుంటూరు, విజయవాడకు వెళ్లే బస్సులు, భారీ వాహనాల వారు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మార్గంలోనే ఈపూరుపాలెం వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. అంతేకాకుండా వంతెనపై గుంతలు పడుతున్నాయి. దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన కావడంతో పూర్తిగా శిధిలావస్థకు చేరింది. అంచుల్లో ఉన్న దిమ్మెలు పూర్తిగా విరిగిపోయాయి. దీనికి తోడు నాన్పుడు వాన తోడు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు యుద్ధప్రాతిపదికన అవసరాలకు అనుగుణం గా నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రజలు, విశ్లేషకులు చెబుతున్నారు.
జీతాలు లేక పనులకు రాక..
ఎన్నికలు లేని కారణంగా పంచాయతీలకు నిధుల్లేవు. దీంతో పారిశుధ్య కార్మికులకు జీతభత్యాలు అందడం లేదు. ఒక్కో పంచాయతీలో నాలుగు లేక ఆ పైనే మాసాలకు సంబంధించి జీతాలు నిలిచాయి. దీంతో దాదాపుగా నియోజకవర్గంలో సింహ భాగం గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు పనులకు మొరాయించారు. ఈ క్రమంలో వీధులు అధ్వానంగా మారాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.