పొగాకు మార్కెట్లో అనిశ్చితి
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:25 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు ధరల సమస్యతో రైతులు సతమతమయ్యారు. ఇప్పుడు అధికంగా జరిగిన పంట ఉత్పత్తి కొనుగోలుపై అయోమయం నెలకొంది. ఎలా ముందుకు పోవాలన్నది అర్థంకాక బోర్డు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
అధిక ఉత్పత్తి కొనుగోళ్లపై తేల్చని కేంద్రం
ఐదు కేంద్రాల్లో నిలిచిన వేలం
ఇంకా రైతుల ఇళ్ల వద్దనే 40శాతం పంట
ముంచుకొస్తున్న సాగు సమయం
ఇప్పటికే ప్రారంభమైన ఈ సీజన్ రిజిస్ట్రేషన్లు
పలుచోట్ల నారుమళ్లు
దక్షిణాది పొగాకు మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు ధరల సమస్యతో రైతులు సతమతమయ్యారు. ఇప్పుడు అధికంగా జరిగిన పంట ఉత్పత్తి కొనుగోలుపై అయోమయం నెలకొంది. ఎలా ముందుకు పోవాలన్నది అర్థంకాక బోర్డు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వారికి తగు సూచనలు ఇవ్వాల్సిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత కరువైంది. ఈ ప్రాంతంలో ఉన్న 11 వేలం కేంద్రాలలో ఇప్పటికే ఐదుచోట్ల అధికారిక కొనుగోళ్లు పూర్తయ్యాయి. అధిక ఉత్పత్తి కొనుగోలుపై స్పష్టత రాక వాటిలో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. ఈ వారంలో మరో రెండు కేంద్రాల్లోనూ అదే పరిస్థితి ఏర్పడనుంది. మరోవైపు వచ్చే సీజన్ పంట సాగుకు సమయం సమీపిస్తోంది. అయితే ఇంకా ప్రస్తుత సీజన్ పంటలో 40శాతం మేర పొగాకు ఇళ్ల వద్దనే మిగిలిపోయింది. దీంతో ఇటు రైతులు, అటు బోర్డు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒంగోలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పొగాకు సాగు పూర్తిగా బోర్డు నియంత్రణలోనే సాగుతోంది. రెండేళ్లుగా కాస్తంత మంచి ధరలు లభించడం, ఇతర పంటలకు వాతావరణం అనుకూలించకపోవడం, ఇతరత్రా కారణాలతో రైతులు ప్రస్తుత సీజన్ (2024-25)లో భారీగా పొగాకు సాగు చేశారు. తదనుగుణంగా పంట ఉత్పత్తి కూడా పెరిగింది. దక్షిణాదిలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న 11 వేలం కేంద్రాల పరిధిలో 104.60 మిలియన్ కిలో ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. అయితే ఈ ప్రాంతంలో పంట సాగు భారీగా జరిగి సుమారు 158.60 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు బోర్డు అధికారులు అంచనాకు వచ్చారు. మార్చి 10 నుంచి రెండు దశల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 93.72 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. సగటున కిలోకు రూ.236.83 ధర లభించింది. ఏటా వంద రోజుల్లో వేలం ప్రక్రియ ముగించాలని పొగాకు బోర్డు ఎప్పటికప్పుడు లక్ష్యంగా పెట్టుకుంటుండగా ఒక నెల అటుఇటుగా సాగుతోంది. అయితే ఈ సీజన్‌లో కొనుగోళ్లు ప్రారంభించి ఆరు నెలలు పూర్తి కావస్తున్నా 60శాతం పంట మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది. పండిన పంటలో ఇంకా 40శాతం రైతుల ఇళ్ల వద్దనే నిల్వ ఉంది.
అపరాధం రెండు సీజన్లు రద్దు
మార్కెట్ ఆరంభంలో కొంత ధరలు బాగున్నప్పటికీ అనంతరం సరిలేక చాలాచోట్ల వేలం ప్రక్రియ వేగం పుంజుకోలేదు. ధరల సమస్య ఇప్పటికీ వెంటాడుతోంది. తాజాగా అధిక పంట కొనుగోళ్ల సమస్య ఎదురైంది. పొగాకు పంట బోర్డు నియంత్రణలో సాగు చేసేది కనుక అనుమతి ఇచ్చిన మేరకే పంట సాగు, ఉత్పత్తి చేయాలి. దానికన్నా 10శాతం వరకు అధికంగా ఉత్పత్తి అయితే వాతావరణ మార్పులో అలా జరగవచ్చు కనుక కొనుగోలు చేస్తారు. అంతకు మించితే అధిక ఉత్పత్తిపై పొగాకు బోర్డు జరిమానా వేస్తుంది. పంట ఉత్పత్తి నియంత్రణ కోసం అలా చేస్తుంది. గతంలో ఒకప్పుడు ఈ పెనాల్టీలు 15శాతం వరకు ఉండేవి. అనంతరం ఒకసారి పది శాతానికి, తర్వాత 7.5 శాతానికి తగ్గించారు. మూడేళ్ల క్రితం పంట ఉత్పత్తి సరిలేకపోవడం, ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడం, ఎక్కువ మంది పరిమితికి లోబడే పండించగా కొద్దిమంది మాత్రమే అధికంగా ఉత్పత్తి చేయడంతో అపరాధ రుసుంను రద్దు చేశారు. తొలుత కర్ణాటకలో రద్దుచేయగా అనంతరం మన రాష్ట్రంలోనూ అమలు చేశారు. అలా రెండేళ్లుగా అదనపు పంటకు అపరాధ రుసుం లేకుండానే కొనుగోళ్లు సాగుతున్నాయి.
దక్షిణాదిలో 51శాతం అదనంగా..
ప్రస్తుత సీజన్ (2024-25)లో రాష్ట్రంలో భారీగా పంట ఉత్పత్తి పెరిగింది. 167 మిలియన్ కిలోలకు అనుమతి ఇవ్వగా సుమారు 235 మిలియన్ కిలోల దిగుబడి వచ్చినట్లు అంచనా. అందులో దక్షిణాదిలో 104.60 మిలియన్ కిలోలకు అనుమతి ఇస్తే సుమారు 158.60 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంటే బోర్డు అనుమతి ఇచ్చిన దాని కన్నా రాష్ట్రంలో 40శాతం అధికంగా ఉత్పత్తి అయ్యింది. దక్షిణాదిలో దాదాపు 51శాతానికిపైగా పెరిగింది. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు సరిగా లభించలేదు. దాని వల్ల రైతులు నష్టపోవడమే కాక వేలం ప్రక్రియలో కూడా జాప్యం జరిగింది. తరుచూ ఒడిదొడుకులు కూడా ఎదురయ్యాయి. దీంతో కేంద్రప్రభుత్వం పంట నియంత్రణ కోసం బోర్డు అధికారులపై ఒత్తిడి తెచ్చి మళ్లీ పెనాల్టీలు విధించాలని సూచించింది. ఈ నేపథ్యంలో నెలన్నర క్రితం బోర్డు అధికారులు ఈ అంశంపై పొగాకు బోర్డు సమావేశంలో చర్చించి అధిక ఉత్పత్తి వల్ల నష్టాలను రైతులకు కూడా వివరించి వారి అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు.
కేంద్రం నుంచి స్పష్టత కరువు
దక్షిణాది రైతులు ఈ ఏడాది ధరలు లేక నష్టపోయే పరిస్థితులు ఉన్న దృష్ట్యా పెనాల్టీలు వద్దని, తప్పనిసరి అయితే రెండుశాతం విధించాలని ఆయా సమావేశాల్లో బోర్డును కోరారు. ఉత్తరాది ప్రాంత రైతులు మాత్రం ఫెనాల్టీలు గట్టిగానే వేయాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ మొత్తం అంశాలపై పొగాకు బోర్డు అధికారులు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు నివేదించారు. అధిక పంట కొనుగోళ్లపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. ఇది జరిగి నెల దాటిపోయినా కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు రాలేదు. ఈలోపు దక్షిణాదిలోని కందుకూరు-1, కందుకూరు-2, కలిగిరి, డీసీపల్లి, కనిగిరిలలో అనుమతి ఇచ్చిన మేర పంట కొనుగోళ్లు పూర్తయ్యాయి. అధిక ఉత్పత్తి కొనుగోళ్లపై స్పష్టత లేక తదుపరి వేలంను ఆ కేంద్రాలలో పొగాకు బోర్డు అఽధికారులు నిలిపివేశారు.
పశ్చిమ ప్రాంతంలో త్వరలో నాట్లు
ప్రస్తుతం మిగిలిన ఆరు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వారంలో ఒంగోలు1,2 కేంద్రాల్లోనూ అనుమతించిన పంట కొనుగోళ్లు పూర్తయ్యి వాటిలోనూ వేలం ఆపేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వచ్చేసీజన్ (2025-26) పొగాకు సాగుకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పలుచోట్ల నారుమడులు కూడా పోశారు. ఈ నెల రెండో సక్షం నుంచి పశ్చిమ ప్రాంత గ్రామాల్లో వచ్చే సీజన్ పొగాకు నాట్లు ప్రారంభంకానున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇంకా జాప్యం చేస్తే రైతుల వద్ద ఉన్న 40శాతం పంట కొనుగోళ్లు ఎప్పటికి పూర్తవుతాయన్న ఆందోళన అటు బోర్డు అధికారులు, ఇటు రైతుల్లో వ్యక్తమవుతోంది.