యువకుడి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:18 PM
మర్రిపూడిలోని కొండవద్ద ఈనెల 18వ తేదీన హత్యకు గురైన ఎమ్మార్సీ కార్యాలయ ఉద్యోగి కొల్లా రాజశేఖర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని కనిగిరి డీఎస్పీ సాయ ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు.
మర్రిపూడి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మర్రిపూడిలోని కొండవద్ద ఈనెల 18వ తేదీన హత్యకు గురైన ఎమ్మార్సీ కార్యాలయ ఉద్యోగి కొల్లా రాజశేఖర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని కనిగిరి డీఎస్పీ సాయ ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. బుధవారం మర్రిపూడిలోని పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హతుడు రాజశేఖర్‌కు పొదిలి విశ్వనాథపురానికి చెందిన జగన్నాథం జయసింహతో స్వలింగ సంపర్క సంబంధాలు గత ఒకటిన్నర సంవత్సర కాలం కిందట కొనసాగాయి. ఈనేపథ్యంలో జయసింహ పొదిలిలో జరిగిన ఒక ఫంక్షన్‌లో రాజశేఖర్‌కు తారసపడ్డాడు. తన సంబంధాన్ని తిరిగి కొనసాగించాలని రాజశేఖర్‌ను ఒత్తిడి చేశాడు. రాజశేఖర్ అంగీకరించకపోవడమే కాకుండా తనపై ఒత్తిడి తెస్తే గే అనే విషయాన్ని నలుగురితో చెప్పి వివాహం కాకుండా చేస్తానని రాజశేఖర్ బెదిరించాడు. దీంతో జయసింహ రాజశేఖర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఇదే సందర్భంలో జయసింహతో ఈ కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పల్లా అనూషతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో కారులో నిందితులిద్దరూ కలిసి రాజశేఖర్‌ను పిలిపించుకున్నారు. ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్లిన రాజశేఖర్‌ను నిందితులు ఇద్దరూ కారుతో పలుమార్లు ఢీకొట్టి తొక్కి చంపారు. నిందితులిద్దరినీ వీరిద్దరినీ కొండ సమీపంలో అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశామన్నారు. ముద్దాయిలను కోర్టుకు హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై రమే్‌షబాబు పాల్గొన్నారు.