Share News

బ్యాంకు నగదు గోల్‌మాల్‌ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:00 AM

యాక్సిస్‌ బ్యాంకులో ఖాతాదారుల డిపాజిట్‌లకు సంబంధించిన రూ.2.49 కోట్ల నగదును దుర్వినియోగం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ తెలిపారు. శుక్రవారం స్థానికసర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

బ్యాంకు నగదు గోల్‌మాల్‌ కేసులో ఇద్దరి అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌, పక్కన పామూరు సీఐ భీమా నాయక్‌, ఎస్సై కిశోర్‌బాబు

క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి మోసం చేసిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌

పామూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : యాక్సిస్‌ బ్యాంకులో ఖాతాదారుల డిపాజిట్‌లకు సంబంధించిన రూ.2.49 కోట్ల నగదును దుర్వినియోగం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌ తెలిపారు. శుక్రవారం స్థానికసర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక యాక్సిస్‌ బ్యాంకులో పనిచేసిన బ్రాంచ్‌ మేనేజర్‌ అలవల సుబ్బారావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ బొందల అనిల్‌సింగ్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. ఈక్రమంలో కొంతమంది ఖాతాదారుల అకౌంట్‌ల నుంచి అక్రమంగా నగదును ఇతరుల ఖాతాలకు పంపారు. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు చేయడానికి వచ్చిన వారి నగదును డిపాజిట్‌ చేయకుండానే చేసినట్లు నకిలీ బాండ్లు ఇచ్చారు. బ్యాంక్‌ లోన్‌లను క్లోజ్‌ చేయడానికి వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకొని స్లిప్‌లు ఇచ్చి లోన్‌ అకౌంట్‌లకు కట్టకుండా మోసానికి పాల్పడ్డారు. మొత్తం 2 కోట్ల 48 లక్షల 690 రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రస్తుత మేనేజర్‌ తిరుపతయ్య బ్యాంకు ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో బ్యాంకు అధికారి కె.లక్ష్మీభార్గవ్‌ విచారణ చేపట్టి ఖాతాదారుల నగదు సుమారు 2కోట్ల 14లక్షల 45వేల 736 రూపాయలు మోసం చేసినట్లు గుర్తించారు. అందులో 34 లక్షల 42వేల 954 రూపాయలు రికవరీ అయింది. ఈమేరకు మేనేజర్‌ తినుపతయ్య జూన్‌ 2న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ దామోదర్‌ పర్యవేక్షణలో సీఐ ఎం.భీమానాయక్‌, ఎస్‌ఐ టి.కిశోర్‌బాబు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మోసానికి పాల్పడిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీలు జరిపే ఖాతాదారులు నెలకోమారు స్టేట్‌ మెంట్లను పరిశీలించుకుంటే ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని డీఎస్పీ సూచించారు.

Updated Date - Jun 07 , 2025 | 01:00 AM