రొయ్యకు ట్రంప్ దెబ్బ
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:32 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో జిల్లాలోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ దేశ ఆంక్షలతో ఇప్పటికే ఇక్కడ రొయ్యల ధరలు దిగజారిపోయాయి.
గణనీయంగా పడిపోయిన ధరలు
ఇంకా దిగజారుతాయన్న భయంలో రైతులు
అమెరికా ఆంక్షలతో సంకట స్థితిలో ఆక్వా రంగం
ఒంగోలు నగరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో జిల్లాలోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ దేశ ఆంక్షలతో ఇప్పటికే ఇక్కడ రొయ్యల ధరలు దిగజారిపోయాయి. రెండు మూడు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.30 తగ్గించి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ట్రంప్ సుంకాల దెబ్బతో ఇంకా ధరలు పడిపోతాయనే భయంతో రైతులు చెరువులను హార్వెస్టింగ్ చేస్తున్నారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో వెనామీ, టైగర్ రకం రొయ్యల సాగు జరుగుతోంది. ఇవి అమెరికాకు కూడా ఎగుమతి అవుతాయి. మన దేశం నుంచి అక్కడికి వెళ్లే ఉత్పత్తులపై ట్రంప్ 25శాతం సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఆ ప్రభావంతో ధరలు తగ్గుముఖం పడుతుం డటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. గత వారంలోనే మూడు రోజులపాటు వ్యాపారులు రొయ్యల కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం నుంచి పునఃప్రారంభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ధరలను గణనీయంగా తగ్గించారు. ఇంకా ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్న రైతులు దక్కినకాడికే అనుకుంటూ చెరువులను తీసేస్తున్నారు.