అతలాకుతలం
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:00 AM
మొంథా తుపాను చీరాల నియోజకవర్గ ప్రజలను పూర్తిగా ముంచేసింది. పంటపొలాలు సైతం మొకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి.
చీరాల, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుపాను చీరాల నియోజకవర్గ ప్రజలను పూర్తిగా ముంచేసింది. పంటపొలాలు సైతం మొకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. అలాగే చేనేత కార్మికుల మగ్గాలు సైతం నీళ్లల్లోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. నియోజకవర్గంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటనష్టాలపై అంచనాలు వేస్తున్నారు. వాడరేవు - రామాపురం మార్గంలో వంతె నల కూల్చివేత పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే రెండు వంతెనలు పూర్తిగా కూలాయి. ఒక చప్టా అధ్వానంగా మారి రాకపోకలు నిలిచింది. అయితే గురువారం రామాపురం వద్ద మిగిలి ఉన్న చివరి వంతె న కూడా కూలిపోయింది. ఉదయం నుండే ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో కలిసి ముందుగా రామకృష్ణా పురంలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామ న్నారు. అలాగే వేటపాలెం మండలం కొత్తపాలెం లిఫ్టిరిగేషన్‌ను పరిశీలించారు. అడ్డంగా నిలిచిన గుర్రపు డెక్కను అధికారులకు సూచనలు చేసి తొలగించి వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. ఇంకా కొన్నిచోట్ల పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. అయితే సాధారణ స్థితకి చేరేందుకు కొంత సమయం పడుతుందని స్థానికులు భావిస్తున్నారు.
చినగంజాం : మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అప్పేరు, కొమ్మమూరు కాలువలకు భారీగా వరద వచ్చింది. దీంతో గొనసపూడి, కడవకుదురు, చింతగుంపల్లె ప్రాంతాల్లో వేసిన వరి పైరు పూర్తిగా నీట మునిగింది. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. గొనసపూడి ప్రాంతంలోని పూర్ణ భాస్కర్ లిఫ్ట్‌ఇరిగేషన్ కింద 125 ఎకరాలలో సాగు చేస్తున్న వరి పైరు మూడు రోజులుగా వరదనీటిలో ఉండి పంట దెబ్బ తిందని రైతులు తెలిపారు. ఇప్పటికి వరకు పంటసాగుకు రూ.20వేలు ఖర్చుచేసినట్లు వివరించారు. పంట పొలాలను వరద ముంచెత్తడంతో పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరులా అయిందని రైతులు కేశన వెంకట్రావు, పొద రామాంజనేయులు, నక్కల సోమయ్య, తోటకూర హరిబాబు, వసంతరావ లు ఆవేదన వ్యక్తం చేశారు. నీలాయపాలెం ప్రాంతంలో 320 ఎకరాల్లో పోసిన వరినార్లు, 90 ఎకరాల్లో ఎదపెట్టిన వరి పంట నాగన్నవాగు వరదనీటికి పైర్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు నీలాయపాలెం రైతులు తెలిపారు. కొమ్మమూరు కాలువకు 15 గండ్లు పడినట్లు నీటిపారుదల శాఖ ఏఈ ఎ.శ్రీదర్ తెలిపారు. పెదగంజాం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద నుంచి ఎన్టీఆర్ వారిధి వరకు రహదారిపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముందుజాగ్రత్తగా రాకపోకలు నిలిపివేసినట్లు తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరారవు తెలిపారు.
ఫపర్చూరులో పర్యటించిన మంత్రులు
పర్చూరు : తుపాను ప్రభావంతో కకావికలమైన పర్చూరు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించటానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్ధసారధి, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలసి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. వరద తీవ్రత అధికంగా ఉన్న పర్చూరు, కారంచేడులో మంత్రులు విస్తృతంగా పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రైతుల సమస్యలపై స్పందన
మంత్రుల పర్యటన సందర్భంగా అన్నంబొట్లవారిపాలెం రైతులు తమ గ్రామానికి కలిపే వంతెన నిర్మాణం అత్యవసరమని విజ్ఙప్తి చేశారు. దీనికి మంత్రి గొట్టి పాటి, ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చర్చించారు. అదేవిధంగా పర్చూరు సబ్‌స్టేషన్ వద్ద డ్రైనేజ్ పైపులు ఏర్పాటు చేయాలని రైతుల వినతిని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆధికారులను ఆదేశించారు.
అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లకు కొత్త ప్రణాళిక
వాడరేవు - పిడుగురాళ్ల హైవేపై రెండు అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రులు సూచించారు. నాగులపాలెం - కారంచేడు హైవే వద్ద సర్వీస్ రోడ్లలో అవసరమైన చోట వంతెనలు నిర్మించేందుకు ప్రతిపాదన రూపొందించాలన్నారు. అదేవిధంగా కేడబ్ల్యూడీ యూటీ(కెడబ్ల్యుడికే) నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వెంటనే సిద్ధ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక తుఫాను ప్రభావం తగ్గిన వెనువెంటనే పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు.
ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: మంత్రి రవికుమార్
వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రైతుల కష్టాలకు తగిన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.
సహాయక చర్యలు వేగవంతం : ఎమ్మెల్యే
అధికారులు సమన్వయంతో పనిచేసి సహాయ చర్యలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశించారు. వరద వల్ల ముంపు వాటిల్లిన గ్రామాల్లో నిల్వ నీటిని తొలగించడానికి డ్రైనేజీ పనులను తక్షణం చేపట్టాలన్నారు. అదేవిధంగా తాగునీరు, రవాణా పునరుద్ధరించాలన్నారు.
వరదనీరు తొలగింపునకు చర్యలు
వేటపాలెం(చీరాల) : మండలంలోని చల్లారెడ్డి పాలెంలో వర్షం నీరు భారీగా చేరింది. దీంతో గ్రామం నుండి నీటిని తొలగించేందుకు ఎంపీడీవో రాజేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, వేటపాలెం ఎస్సై జనార్ధన్ చర్యలు చేపట్టారు. ఎక్స్‌కవేటర్ సాయంతో డ్రయినేజీ ఏర్పాటు చేసి నీటిని తొలగించారు. వారివెంట పంచాయతీ అధికారులు ఉన్నారు.
వరదప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటన
చినగంజాం : మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చినగంజాం, ఇంకొల్లు మండలాల్లో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పంట నివేదికలను త్వరిత గతిన రూపొందించాలని చీరాల ఏడీఏ రత్న కుమారికి సూచించారు. కడవకుదురు, చింతగుంపల్లె, గొనస పూడి, భీమవరం ప్రాంతాల్లో నీటమునిగిన వరి పంట లను ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా పరిశీలించారు. ్గకడవకుదరు గ్రామానికి చెందిన షేక్ జిలానికి చెందిన కోళ్లఫాంలో వరదనీరు వచ్చి కోళ్లు మృతి చెందడంతో వాటిని పరిశీలించారు.. గ్రామ పరిధిలో 6.14 ఎకరాల తోపుపోరంబోకు భూమి విషయం దొడ్డక బాలకృష్ణ రామకృష్ణలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ఆ భూమిని పోరంబోకు భూమిగా మార్చి పట్టాలు ఇవ్వా లని తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావుకు సూచిం చారు. తుపాను నేపథ్యంలో ఆర్‌బీ.ఛానల్‌కు పడిన గండ్లు వెంటనే పూడ్చాలని డీఈ ప్రసాద్‌ను ఆదేశిం చారు. రొంపేరు వరదనీరు గ్రామంలోనికి రాకుండా షట్టర్లు ఏర్పాటు చేయాలని డ్రైనేజీ డీఈ డి.సుబ్బా రావును ఆదేశించారు. గొనసపూడి కొమ్మమూరు కాలువ నుండి అప్పేరు వాగుకు లాకులు ఏర్పాటు చేయాలని, గొనసపూడి ప్రాంతంలో కొమ్మమూరు కాలువకు పడిన గండ్లును పూడ్చాలని ఆదేశించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన తోటకూర సత్యనారాయణ విషయం ఆయన తెలుసుకొని సత్య నారాయణ నాయనమ్మ శేషమ్మకు ఆర్థిక సాయం అందించారు. ఇంకొల్లు మండలంలోని కొణికి వద్ద కొత్త వరద పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దుద్దుకూరు గ్రామంలో లోలెవల్ వంతెనను పరిశీలిం చారు. వరదలకు కూలిన వందేళ్ల నాటి రావి చెట్టును పరిశీలించారు. అనంతరం ఊరచెరువు గండిని పరిశీ లించి తక్షణమే కట్టవేయాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ నాయుడు, పలు శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న రహదారులు.. స్తంభించిన రాకపోకలు
పర్చూరు/కారంచేడు : పర్చూరు కారంచేడు మండలాల్లో వరద విలయతాండవం చేస్తోంది. వాగులు, వంకలు కాలువలు పొంగి పొరలుతుండ డంతో వేల ఎకరాల్లో సాగుచేసుకున్న పైర్లు జల మయం అయ్యాయి. కొన్ని చోట్ల వరద నీటికి రోడ్లు దెబ్బతిని రాకపోకలు స్తంభిచాయి. దీంతో ఆయా మార్గా ల్లో రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరు, కారంచేడుకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు కారంచేడు నుంచి వాడరేవు వెళ్లే వాగుకు గండి పడడంతో పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి.
కొణిదెనరోడ్డులో గుంతల పూడ్చివేత
మార్టూరు : భారీ వర్షాలు కారణంగా మార్టూరు గ్రామంలో కొణిదెన రోడ్డులో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వాస్తవంగా గతంలో ఏర్పడిన గుంతలు ఈ తుఫాను కారణంగా మరింత విస్తరించాయి. మార్టూరు నుంచి ఈ రోడ్డు మీదుగా గొట్టిపాటి నగర్, డక్కలి కాలనీ, విజయనగర్ కాలనీవాసులు, రాజుపాలెం, కొణిదెనవాసులు రోజూ ప్రయాణిస్తుంటారు. గోతులు పెరగడంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉండడంతో గురువారం మార్టూరు పంచాయతీ ఈవో తన్నీరు శ్రీనివాసరావు ఎర్ర గ్రావెల్‌ను ట్రాక్టర్లుపై తెప్పించి, గోతులను పూడ్చివేశారు. అనంతరం ఎక్స్‌కవేటర్‌తో మట్టిని చదును చేయించగా, తాత్కాలికంగా వాహనదారులుకు గుంతలు సమస్య తీరింది.
నర్సరీలో నీటమునిగిన మొక్కలు
అద్దంకి : మండలంలోని రామాయపాలెంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఉపాథిహామీ పథకం నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలోకి వరద నీరు చేరి గురువారానికి కూడా బయటకు వెళ్లలేఏదు. దీంతో నర్సరీలో ప్రస్తుతం ఉన్న 20 వేల మొక్కలు పూర్తిగా కుళ్లిపోయే ప్రమాదం ఉంది. నీటి లో మునిగిన నర్సరీని గురువారం అటవీశాఖ కూకట్లపల్లి బీట్ ఆఫీసర్ రమేష్ పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.