Share News

చాకుతో పొడిచి గిరిజనుడి హత్య

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:18 PM

చిన్న పిల్లాడున్న తల్లికి సారా ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని పెద్దమంతనాల గిరిజనగూడెంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

చాకుతో పొడిచి గిరిజనుడి హత్య

పెద్దదోర్నాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : చిన్న పిల్లాడున్న తల్లికి సారా ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని పెద్దమంతనాల గిరిజనగూడెంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పెద్దమంతనాలకు చెందిన అర్తి నాగన్న అతని అన్న కొడుకైన అర్తి అంకన్న(27)ను చాకుతో పొడవగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అర్తి అంకన్న, అతని తండ్రి రామారావు హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లి దోమతెర కర్రలు అమ్ముకుని సాయంత్రం ఇంటికి చేరే సరికి అతని అంకన్న భార్య దేవమ్మకు నాగన్న సారా తాగాలని గ్లాసులో పోస్తుండడం అంకన్న చూశాడు. నెలల పిల్లాడితో ఉన్న తన భార్యకు సారా ఎందుకు పోస్తున్నావని నాగన్నను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ పెద్దది కావడంతో నాగన్న విల్లంబుతో దాడి చేయబోగా అంకన్న అంబును విరిచేశాడు. అంతటితో ఆగక తన వద్ద ఉన్న చాకుతో అంకన్న గుండెపై బలంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాగన్న అక్కడ నుంచి పారిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్య చికిత్స నిమిత్తం ఆటోలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దోర్నాల పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్సై మహేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్య విషయం తెలియడంతో మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్‌ వైద్యశాలలోని మృతదేహాన్ని పరిశీలించారు.

Updated Date - Nov 20 , 2025 | 11:18 PM