వణికిస్తున్న వాతావరణం
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:20 AM
జిల్లాను వ్యాధులు చుట్టుముట్టాయి. ఇటీవల పెరిగిన చలితీవ్రత, వరుస వానలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరుగుతు న్నాయి. ఇంటికో బాధితుడు జలుబు, తగ్గని దగ్గు సమస్యలతో బాధపడు తున్నారు.
వెంటాడుతున్న వ్యాధుల భయం..!
పెరుగుతున్న శ్వాస సంబంధ సమస్యలు
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట
పలు ఆరోగ్య సమస్యలతో ఇంటికో బాధితుడు
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాను వ్యాధులు చుట్టుముట్టాయి. ఇటీవల పెరిగిన చలితీవ్రత, వరుస వానలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరుగుతు న్నాయి. ఇంటికో బాధితుడు జలుబు, తగ్గని దగ్గు సమస్యలతో బాధపడు తున్నారు. మరికొందరు జ్వరాలతో వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవారి లోనూ ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలు అధికమయ్యాయి. వైరల్ జ్వరాలు నమోదవుతున్నాయి. 40 ఏళ్లు పైబడిన వారు, వృద్ధుల్లో కీళ్లనొప్పులు, అలాగే ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది.
నీటి కాలుష్యంతో ముప్పు
నీటి కాలుష్యం కారణంగా డయేరియా, పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలు, చికెన్‌ఫాక్స్, పిల్లల్లో మీజిల్స్, నీళ్ల విరేచనాలు, గవద బిళ్లలు,పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రస్తుతం చెరువుల్లో కొత్తగా చేరిన నీటిని అధికార యంత్రాంగం కొళాయిల ద్వారా గృహాలకు విడుదల చేయడంతో రోగాలు మరింత అధికంకానున్నాయి. అయితే కొళాయిల ద్వారా ఇచ్చే నీటిని ఏరోజుకారోజు నీటి పరీక్షలు నిర్వహించి, శుద్ధి చేసిన అనంతరం అందించాల్సిన యంత్రాంగం కొన్ని ప్రాంతాలలో అలాగే వదిలేయ డంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.