వణికిస్తున్న విషజ్వరాలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:24 AM
మండలంలో మారుమూల గ్రామమైన పూరి మెట్లలో విషజ్వరాలు విజృంభించాయి. ఇంటికి ఒకరి నుంచి ఐదుగురు వరకు మంచం పట్టారు. వీరిలో కొందరు గున్యా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల వారు.
పూరిమెట్లలో 300 మంది వరకూ బాధితులు
కొందరికి గున్యా లక్షణాలు
చికిత్స కోసం రూ.వేలు ఖర్చు పెడుతున్న పేదలు
ముండ్లమూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మారుమూల గ్రామమైన పూరి మెట్లలో విషజ్వరాలు విజృంభించాయి. ఇంటికి ఒకరి నుంచి ఐదుగురు వరకు మంచం పట్టారు. వీరిలో కొందరు గున్యా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల వారు. ఇప్పటికే ఒక్కొక్కరు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చుపెట్టి చికిత్స చేయించుకున్నా ఏమాత్రం తగ్గటం లేదు. ఆర్థిక స్థోమత లేనివారిలో కొందరు మారెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో, మరికొందరు స్థానికంగా ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. నెలరోజుల నుంచి గ్రామాన్ని విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలలో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు కనిపిస్తున్నారు.
ఒక్కో ఇంట్లో ఐదారుగురు
కాండ్ర సుధారాణి కుటుంబం విష జ్వరాలతో బాధపడుతోంది. గ్రామంలోని ప్రధాన వీధికి చెందిన బొమ్మినేని సుబ్బారావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు గున్యా, విషజ్వరాలతో మంచం పట్టారు. ముల్లా తిరుపతమ్మ, నిడిగంటి కోటేశ్వరమ్మ, చొప్పురపు ధనలక్ష్మి, ముండ్ల ఏడుకొండలుతో పాటు మరో 300 మందికి పైగానే జ్వరం, గున్యాతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.