వణికిస్తున్న జ్వరాలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:29 AM
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెలు మంచం పట్టాయి. పట్టణాల్లోనూ జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నెల నుంచి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా అధికారికంగా లక్షా రెండువేల మందికిపైగా పీడితులు
అనధికారికంగా మరో లక్ష మందికిపైనే..
ఒంగోలు మండలంలో అత్యధికంగా 9,369 మంది
మొక్కుబడిగా ఫీవర్ సర్వే
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లెలు మంచం పట్టాయి. పట్టణాల్లోనూ జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. నెల నుంచి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లక్షా రెండు వేల మందికి పైగా జ్వర బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కలు కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సకు వచ్చిన వారివి మాత్రమే. ఇక ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద మరో లక్ష మందికిపైగా వైద్యం చేయించుకుని ఉంటారనేది అంచనా.
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల కురిసిన వర్షాలతోపాటు గ్రామీ ణ ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినా క్షేత్రస్థాయిలో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో చెత్తాచెదారం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. తద్వారా దోమల ఉత్పత్తి పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సాధారణంగా సీజనల్ వ్యాధులు వస్తూపోతుంటాయి. ఆ సమయంలో వైద్యశాఖతోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా వాటిని అరికట్టడం సాధ్యమవుతుంది. అయితే ప్రస్తుతం గ్రామాల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.
ఫీవర్ సర్వే అంతంతమాత్రమే!
సాధారణంగా ప్రస్తుత సమయంలో వైద్యశాఖ ద్వారా ఫీవర్ సర్వే నిర్వహించి తద్వారా వచ్చిన సమా చారానికి అనుగుణంగా వైద్యశాఖ క్షేత్రస్థాయిలోని వైద్యులను అప్రమత్తం చేయాల్సి ఉంది. అయితే అంతా మొక్కుబడిగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫీవర్ సర్వే ద్వారా ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారిలో ఎవరైనా వ్యాధుల బారిన పడ్డారా అన్న విషయాలు తెలుస్తాయి. ఆ ప్రకారం బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించవచ్చు. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
జిల్లాకేంద్రం చుట్టుపక్కలే భారీగా...
జిల్లాలోని ఒంగోలు మండలంలో అత్యధికంగా నెల వ్యవధిలో 9,369 జ్వర కేసులు నమోదు కాగా అతి తక్కువగా కొండపి మండలంలో కేవలం 510 మంది మాత్రమే ఉన్నారు. అలాగే అన్ని మండలాల్లో వందలాది మంది జ్వరాలతో బాధపడుతున్నారు. చీమకుర్తి మండలంలో 6,130 మంది, కనిగిరిలో 5,790 మంది, గిద్దలూరులో 4,589 మంది, మార్కాపురంలో 4,150 మంది, మద్దిపాడు మండలంలో 3,108 మంది, హెచ్‌ఎంపాడు మండలంలో 2,618 మంది జ్వరపీడిత కేసులు నమోదయ్యాయి. పామూరు మండలంలో 3,941 మంది, పొదిలిలో 3,571 మంది, దర్శిలో 3,585 మంది, త్రిపురాంతకం 2,954 మంది, వైపాలెం 2,969 మంది, ముండ్లమూరు 2,723 మంది, సింగరాయకొండ 2,407 మంది, తాళ్లూరు 2,420 మంది జ్వరపీడితులు ఉన్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇతర మండలాల్లో 500 మంది నుంచి 2వేల మందికిపైగా జ్వరపీడితులు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.