ధర్మవరం వరకు రైలు పొడిగింపు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:42 PM
గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వరకు వెళ్తున్న (17261) నెంబరు రైలును తిరుపతి నుంచి ధర్మవరం వరకు 2 నెలలపాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు.
గిద్దలూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వరకు వెళ్తున్న (17261) నెంబరు రైలును తిరుపతి నుంచి ధర్మవరం వరకు 2 నెలలపాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. అక్టోబరు 1 నుంచి నవంబరు 30వ తేదీ వరకు గుంటూరు నుంచి తిరుపతి వరకు వెళ్లే ఈ రైలు ధర్మవరం వరకు వెళ్తుంది. 2వ తేదీ నుంచి డిసెంబరు 1వ వరకు ధర్మవరం నుంచి తిరుపతి మీదుగా గుంటూరుకు ఈ రైలు 19 కోచ్‌లతో వెళ్తుంది. గుంటూరు నుంచి తిరుపతి వరకు పాత సమయాలలోనే ఈ రైలు తిరుగుతుందని, గుంటూరులో సాయంత్రం 4.30కి బయలుదేరి గిద్దలూరు మీదుగా తిరుపతికి మరుసటి రోజు తెల్లవారుజామున 3.55కి చేరి అక్కడి నుంచి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి, కదిరి మీదుగా ఉదయం 9గంటలకు ధర్మవరం చేరుతుందని అధికారులు ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి తిరుపతికి 7.15 గంటలకు చేరుతుందని, అక్కడి నుంచి రేణిగుంట, నంద్యాల, గిద్దలూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.