Share News

ఎగువ చెర్లోపల్లికి రాకపోకలు బంద్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:47 PM

రాష్ట్ర ప్రగతికి రహదారులు అభివృద్ధి మార్గం. అయితే అందుకు భిన్నంగా మండలంలోని ఎగువ చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

ఎగువ చెర్లోపల్లికి రాకపోకలు బంద్‌
బ్రిడ్జిపై నుంచి ప్రహిస్తోన్న వరద నీరు (ఫైల్‌)

అడుగడుగునా గుంతలు

శిథిలావస్థలో బ్రిడ్జి 8 ప్రజలకు తిప్పలు

పెద్ద దోర్నాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రగతికి రహదారులు అభివృద్ధి మార్గం. అయితే అందుకు భిన్నంగా మండలంలోని ఎగువ చెర్లోపల్లి గ్రామానికి వెళ్లే రహదారులు గుంతలతో అధ్వానంగా మారాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఎగువ చెర్లోపల్లి గ్రామ ప్రధాన రహదారి అస్త్తవ్యస్తంగాతయారయింది.కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నుంచి 7కిలో మీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఏర్పడింది. ఈ గ్రామం నుంచి మరి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇంకా లోతట్టు అటవీ ప్రాంతంలో చిలకచెర్ల గూడెం, బంధం బావి, చెరువుగూడెం ఉన్నాయి. ఎగువ చెర్లోపల్లి గ్రామ సమీపం నుంచే మిగిలిన గ్రామాలకు వెళ్లాలి. ఒకే ప్రధాన రహదారి గుండా నాలుగు గ్రామాల ప్రజలు ప్రయాణించాల్సి ఉంది. ఇదే రహదారి ఎగువ చెర్లోపల్లి ఊరిని కలుపుతూ మధ్యలో తీగలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం దశాబ్దాల కిందట జరిగింది. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమై పోయింది. ఏటా వర్షాకాలంలో బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. ఈ గ్రామాల్లో చెంచు గిరిజనులు అధిక శాతం మంది ఉంటున్నారు. వారు అటవీ ఉత్పత్తులు సేకరించి పట్టణాల్లో విక్రయించి, వచ్చిన సొమ్ముతో నిత్యావరస సరుకులు కొనుగోలు చేస్తారు. అంతేగాక ఉద్యోగులు, విద్యార్థులు కూడా సమయానికి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావడంతో సేద్యానికి కావలసిన ఎరువులు, విత్తనాలు పండించిన పంట ఉత్పత్తులు బయటకు తీసుకురాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయమై గ్రామాల ప్రజలు పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు, పాలకులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి, రహదారిని నిర్మించాలని చెంచు గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 10:47 PM