రాకపోకలు బంద్
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:32 PM
గతనెలలో వచ్చిన మొంథా తుఫాన్ ప్రభావం వలన గత 10రోజులుగా కంభం, అర్ధవీడు మండలాలలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
10 రోజులుగా బ్రిడ్జిలపై వరద
ఇంకా ప్రవాహం తగ్గని
గుండ్లకమ్మ, జంపలేరు వాగులు
గ్రామాల మధ్య లేని బాహ్య సంబంధాలు
కంభం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గతనెలలో వచ్చిన మొంథా తుఫాన్ ప్రభావం వలన గత 10రోజులుగా కంభం, అర్ధవీడు మండలాలలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వచ్చిన తుఫాన్‌ల వలన గుండకమ్మ, జంపలేరు వాగులు ప్రవహించినా ఒకటి, రెండు రోజులలో యధావిధిగా రాకపోకలు సాగేవి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గుండకమ్మ, జంపలేరు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో అర్ధవీడు మండలంలోని మాగుటూరు, యాచవరం, కాకర్ల గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిలపై నుంచి జంపలేరు వాగులు ప్రవహించడంతో రోడ్లు, బ్రిడ్జిలు పూర్తిగా కోతకు గురై రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయి. అలాగే కంభం - రావిపాడు గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి గత 10రోజులుగా గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తుండడంతో ఆ గ్రామానికి వెళ్లాలన్నా గ్రామస్థులు కంభం రావాల్సి వస్తోంది. దీంతో రావిపాడు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కంభం - ఎర్రబాలెం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తుండడంతో ఆ గ్రామాల ప్రజలు అర్ధవీడు మండలంలోన బోగోలు, మొహిద్దీన్ పురం, నాగులవరం గ్రామాల నుంచి 25కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కంభం రావాల్సి వస్తుంది. దీంతో అత్యవసర పనిమీద కంభం రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కంభం చెరువు పూర్తిగా నిండి నిండుకుండలా ఉన్న చెరువు అందాలను వీక్షించేందుకు వందలాది మంది పర్యాటకులు చెరువు కట్టపై వెళ్లే మార్గానికి అడ్డంగా అలుగు వాగు ప్రవహిస్తుండడంతో కట్టపైకి వెళ్లలేక అలుగును చూసి తృప్తి పడి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. కార్తీక మాసంలో ప్రధానంగా వనభోజనాలు కంభం చెరువు కట్టపై జరిగేవి. ప్రస్తుతం చెరువు కట్ట వద్ద పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో వనభోజన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రయాణాలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల మధ్య బ్రిడ్జిలను ఎత్తు పెంచడం, నూతన బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.