రాకపోకలకు నేటికీ తప్పని ఇక్కట్లు
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:48 AM
నిత్యం వందల వాహనాలు ప్రయాణించే అద్దంకి-రేణింగవరం రోడ్డు లో నల్లవాగుపై ఉన్న కల్వర్టు వద్ద ప్రమాదం పొంచి ఉంది.
నల్లవాగుపై ప్రమాదకరంగా బ్రిడ్జీ
అద్దంకి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నిత్యం వందల వాహనాలు ప్రయాణించే అద్దంకి-రేణింగవరం రోడ్డు లో నల్లవాగుపై ఉన్న కల్వర్టు వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లవాగుకు వరద ప్రవాహం పెరిగింది. కల్వర్టు సపోర్ట్ వాల్ కోసుకుపోయింది. అసలే శిథిలావస్థకు చేరిన కల్వర్టు వరదతో మరింత బలహీన పడింది. కల్వర్టు ఇరుకుగా ఉండడంతో వాహనాలు ఎదురెదురు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహ నచోదకులు ఆందోళన చెందుతున్నారు. అద్దంకి నుంచి రేణింగవరం వరకు డబుల్ రోడ్డుగా మార్చిన ప్పటికి నల్లవాగు కల్వర్టు మాత్రం చిన్నదిగా ఉంది. జార్లపాలెం, కశ్యాపురంల వద్ద ఉన్న కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి. వర్షాల సమయంలో రాకపోకలు నిలిచి పోతున్నాయి. వాహనాల రాకపోకలు పెరిగినందున మూడు వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టాలని వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు.
బల్లికురవ : తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో రహదారులపై వర్షంనీరు వీడలేదు. గ్రామాలలో దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మండలంలోని కొప్పెరపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాల పక్కన ఉన్న వీధిలో వారం రోజుల నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచి ఉంది. ఈ నీరు వెళ్లే కాలువలు లేక పోవడంతో అలానే ఉంది. ప్రజలు నీటిలోనే రాక పోకలు సాగిస్తున్నారు. కాలువలు లేకపోవడంతో ఈ నీరు అలానే పాచిపట్టిందని ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా, రోడ్లపై నీరు నిలుస్తోందని, విద్యార్థులు సైతం పాఠశాలకు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే వర్షపు నీరు ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పంగులూరు : పంగులూరు ఇసుకవాగులో నేల చప్టాపై గుంతలను పూడ్చేందుకు ఉపయోగించిన బంకమట్టితో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మొంథా తుపాన్ కారణంగా వరద తాకిడికి పంగులూరు నుంచి తక్కెళ్లపాడు వెళ్లే రోడ్డు లోని నల్లవాగు చప్టాపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతులు పూడ్చేందుకు నల్లటి బంకమట్టిని వినియో గించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అద్దంకి : మండల కేంద్రమైన అద్దంకితో మండలం లోని మూడు గ్రామాలకు రాకపోకలు నేటికీ ప్రారంభం కాలేదు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన మరో వారం పడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. తిమ్మాయపాలెం-ఇలపావులూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో మోదేపల్లి వద్ద చిలకలేరు వాగు ఉధృతికి రోడ్డు కోసుకుపోయింది. అదే సమయంలో పేరాయపాలెం వద్ద ధోర్నపువాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో మండలంలోని పేరాయపాలెం,ఽ దేనువకొండ, ఉమ్మనేనివారిపాలెంల నుంచి అద్దంకికి రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లూరు, వెల్లంపల్లి మీదుగా అద్దంకి చేరుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో తాళ్లూరు, చీమకుర్తి, మద్దిపాడు మండలాలలోని పలు గ్రామాల నుంచి కూడా అద్దంకికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అద్దంకి నుంచి తాళ్లూరు, గంగవరం, బొద్దికూరపాడులకు నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపి వేశారు. తాత్కాలిక మరమ్మతులు వెంటనే పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బంకమట్టితో మరమ్మతులు
వాహనచోదకులకు ఇక్కట్లు
పంగులూరు: పంగులూరు ఇసుకవాగులో నేలచప్టాపై గుంటలు పూడ్చేందుకు ఉపయోగించిన బంకమట్టితో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మొంథా తుఫాన్ కారణంగా వరద తాకిడికి పంగులూరు నుంచి తక్కెళ్లపాడు వెళ్లే రోడ్డు లోని నల్లవాగు చప్టాపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతులను పూడ్చేందుకు బంకమట్టిని వినియోగిం చడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొమర్నేనివారిపాలెం(పర్చూరు) : మొంథా తుఫాను ప్రభావంతో రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా, కాలువలు, వాగులకు గండ్లు పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించేందుకు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి. దీంతో గ్రామ పంచాయితీ, స్థానిక నేతల సారథ్యంలో ప్రత్యేక ఎక్సకవేటర్‌ను ఏర్పాటు చేసుకొని దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయి.