విజిలెన్స్ దాడులతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:50 PM
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముమ్మర దాడులతో ఎరువులు, విత్తనాల వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లా నుంచి అధికారులు ఏప్రాంతానికి వస్తున్నారో అనే సమాచారం ఏదోరకంగా తెలుసుకొని అధికశాతం మంది వ్యాపారులు దుఖాణాలను బంద్‌చేసి పత్తాలేకుండా పోతున్నారు.
దుఖాణాలు మూసివేత
అక్రమంగా నిల్వఉంచిన ఎరువులు, విత్తనాలను ఇతర ప్రాంతాలకు తరలింపు
దర్శి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముమ్మర దాడులతో ఎరువులు, విత్తనాల వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లా నుంచి అధికారులు ఏప్రాంతానికి వస్తున్నారో అనే సమాచారం ఏదోరకంగా తెలుసుకొని అధికశాతం మంది వ్యాపారులు దుఖాణాలను బంద్‌చేసి పత్తాలేకుండా పోతున్నారు. అక్రమంగా నిల్వఉంచిన ఎరువులు, విత్తనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వ్యాపారులు సాగించిన అక్రమ వ్యాపారాల పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలను సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు నిఘా టీమ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత కొన్నిరోజులుగా దర్శి, పొదిలి ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల అక్రమంగా నిల్వఉన్న ఎరువులను, విత్తనాలను సీజ్ చేశారు. ప్రధానంగా యూరియా నిల్వలు మారుమూల ప్రాంతాల్లో కూడా పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా వేస్తున్న తరుణంలో యూరియాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు వారికి వచ్చిన యూరియా కోటాను గ్రామీణ ప్రాంతాల్లో తమకు అనుకూలమైన వ్యాపారుల వద్దకు పంపి అధిక ధరలకు విక్రయించి లాభాలు పంచుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ఎరువుల దుఖాణాల్లో బిల్లులు లేకుండా నిల్వ ఉన్న యూరియా వందలాది బస్తాలు పట్టుబడింది. కొంతమంది వ్యాపారులు ఇతర జిల్లాల నుండి అడ్డగోలుగా విత్తనాలు తెచ్చి రైతులకు విక్రయిస్తున్నారు. ఆ వ్యాపారులు విత్తనాల విక్రయాలకు లైసెన్స్‌లు కూడా తీసుకోకుండా ఏళ్ల తరబడి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇంతకాలం స్థానిక వ్యవసాయాధికారులు షాపుల యజమానులు వద్ద మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరించారు.
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడుల్లో అక్రమాలు వరుసగా బయట పడుతుండటంతో రైతులు విస్తుబోతున్నారు. వ్యాపారులు భయాందోళనలతో గడగడలాడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన విత్తనాలు నాణ్యత కల్గినవా, నాసీరకమా అన్న విషయం గూర్చి పట్టించుకోకుండా వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఎరువులు, విత్తనాల వ్యాపారాల్లో వెలుగుచూసిన అక్రమాలపై ఉక్కుపాదం పెట్టి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.