Share News

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌

ABN , Publish Date - Jun 08 , 2025 | 11:38 PM

జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్‌
మృతి చెందిన జగదీష్‌

యువకుడు దుర్మరణం

జీవీఆర్‌ ఫ్యాక్టరీ ఎదుట జాతీయ రహదారిపై ప్రమాదం

సింగరాయకొండ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం స్థానిక జీవీఆర్‌ ఫ్యాక్టరీ ఎదుట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమరాజుపల్లి గ్రామానికి చెందిన పొటేళ్ల జగదీష్‌ (24) పదేళ్ల నుంచి తన తల్లిదండ్రులతో కలసి అమ్మమ్మగారి గ్రామమైన ఉలవపాడు మండలం కొల్లూరుపాడులో ఉంటున్నాడు. ఆదివారం ఉలవపాడు నుంచి ఆటోలో మామిడికాయలను ఒంగోలు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మామిడికాయల ఖాళీ కేస్‌లను తీసుకొని ఆటోలో ఉలవపాడు బయల్దేరాడు. మార్గమధ్యలో సింగరాయకొండ సర్వీ్‌సరోడ్డు నుంచి జీవీఆర్‌ ఫ్యాక్టరీ ఎదుట జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న గుర్తుతెలియని ట్రాక్టర్‌ వెనుకవైపు నుంచి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న జగదీష్‌ రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న హైవే మొబైల్‌ పోలీసులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ట్రక్కును అక్కడే వదిలివేసి ఇంజన్‌తో పరారయ్యాడు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సీసీకెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ ఆధారంగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి. మహేంద్ర జరిగిన ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2025 | 11:38 PM