Share News

సంక్షోభం దిశగా..

ABN , Publish Date - May 12 , 2025 | 01:52 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. వేలం కేంద్రాలు ప్రారంభమై రెండు మాసాలైనప్పటికీ పండిన పంటలో 15శాతం కూడా వ్యాపారులు కొనుగోలు చేయలేదు. రోజువారీ కేంద్రాలకు రైతులు తెస్తున్న బేళ్లలో 20నుంచి 25శాతం తిరస్కరణలు (నోబిడ్‌) ఉంటున్నాయి.

సంక్షోభం దిశగా..
నోబిడ్‌ అయిన పొగాకు బేళ్లను వెనక్కి తీసుకెళ్తున్న రైతులు (ఫైల్‌)

దక్షిణాది పొగాకు మార్కెట్‌లో ఆందోళనకర పరిస్థితి

వేలం ప్రారంభించి రెండు మాసాలు.. 15శాతం లోపే కొనుగోళ్లు

గరిష్ఠ ధరలపై వ్యాపారుల సీలింగ్‌

కిలో రూ.280కి మించకుండా నియంత్రణ

మీడియం, లోగ్రేడ్‌ల పట్ల విముఖత

నిత్యం భారీగా నోబిడ్‌లు

కొనుగోళ్లను తగ్గించిన ఎగుమతిదారులు

ఆందోళన చెందుతున్న రైతులు

నేడు బోర్డు అధికారులు, వ్యాపార, రైతు ప్రతినిధులతో మంత్రుల భేటీ

దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. వేలం కేంద్రాలు ప్రారంభమై రెండు మాసాలైనప్పటికీ పండిన పంటలో 15శాతం కూడా వ్యాపారులు కొనుగోలు చేయలేదు. రోజువారీ కేంద్రాలకు రైతులు తెస్తున్న బేళ్లలో 20నుంచి 25శాతం తిరస్కరణలు (నోబిడ్‌) ఉంటున్నాయి. ఎక్స్‌పోర్టర్లు (ఎగుమతి కంపెనీలు) నామమాత్రంగా కొంటుండటం ఈ పరిస్థితికి కారణమైంది. పొగాకు వేలం ఆరంభం నుంచి వ్యాపారులు కూటమి కట్టి ధరలపై సీలింగ్‌ విధించి కొనుగోలు చేస్తున్నారు. తొలిరోజున గరిష్ఠ ధర కిలోకు రూ.280 ఇచ్చిన వారు నేటికీ అదే ధరను కొనసాగిస్తు న్నారు. కనిష్ఠ ధరలు మాత్రం రూ.200కు పడిపోయాయి. కొనుగోళ్ల మందగమనం తోపాటు భారీగా నోబిడ్‌లు ఉంటుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఒంగోలు, మే 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి పొగాకు బోర్డు 160 మిలి యన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అందులో దక్షిణాదిలోని 11 కేంద్రాల పరిధిలో 105 మిలియన్‌ కిలోలు పండించాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా మార్కెట్‌ ఆశాజనకంగా ఉండటం, ఈ సీజన్‌లో వాతావరణం ఇతర పంటలకు అనుకూలిం చకపోవడంతో దక్షిణాది రైతులు విస్తారంగా పొగాకు సాగు చేశారు. ఫలితంగా పంట ఉత్పత్తి భారీగా పెరి గింది. సుమారు 161 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అయినట్లు బోర్డు అధికారులు అంచనా వేసి మార్చి 10న కొనుగోళ్లను ప్రారంభించారు. తొలుత ఒకింత హాట్‌హాట్‌గానే కొన్న వ్యాపారులు అనంతరం క్రమం గా తగ్గిస్తూ వస్తున్నారు. తొలిరోజు గరిష్ఠ ధర కిలోకు రూ.280 ఇచ్చిన వారు ఆతర్వాత కూటమి కట్టారు. సీలింగ్‌ పెట్టి అదే గరిష్ఠ ధరను కొనసాగిస్తూ కనిష్ఠ ధరలను మాత్రం తగ్గించి వేశారు. అదేసమయంలో వేలం కేంద్రాల వెలుపల పలుచోట్ల అక్రమ కొనుగోళ్లు చేస్తున్నారు.

రెండు నెలల్లో 24 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు

ప్రస్తుతం సీజన్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకు సుమారు 24 మిలియన్‌ కిలోల పొగాకు మాత్ర మే కొనుగోలు జరిగినట్లు అధికార వర్గాల సమా చారం. సగటున కిలోకు రూ.262 ధర లభిం చింది. ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది సగటు ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తు న్నాయి. గతం కన్నా అన్ని రకాల ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సమయంలో వ్యాపారులను, రైతులను సమన్వయం చేయడంలో పొగాకు బోర్డు అధికారులు విఫలమయ్యారు.

మీడియం, లోగ్రేడ్‌లను కొనుగోలు చేయని వ్యాపారులు

వ్యాపారులు మీడియం, లోగ్రేడ్‌ పొగాకు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రత్యేకించి ఎక్స్‌పోర్టర్లుగా ఉన్న కంపెనీల బయ్యర్లు కొనుగోళ్ల శాతాన్ని పూర్తిగా తగ్గించి వేశారు. సాధారణంగా రోజువారీ ఈ కంపెనీలు 25శాతంపైనే కొనుగోలు చేస్తుంటాయి. ప్రస్తుతం అందులో సగం కూడా కొనడం లేదు. చిన్న డీలర్లదీ అదే పరిస్థితి. ఇక ప్రధానమైన ఐటీసీ సాధారణంగా 35నుంచి 40శాతం బేళ్లను కొంటుంది. అలాంటిది ప్రస్తుతం 60శాతం వరకూ కొనుగోలు చేస్తున్నప్పటికీ ధరలను మాత్రం పెంచడం లేదు. ప్రత్యేకించి మీడియం, లోగ్రేడ్‌ల జోలికి వెళ్లడం లేదు. రోజువారీ వేలం కేంద్రాలకు వచ్చే బేళ్లలో ఈతరహా 50శాతం వరకూ ఉంటుండగా అందులో సగం నోబిడ్‌ అవుతున్నాయి. మేలు రకం బేళ్లకు మున్ముందు మంచి ధర లభిస్తుందన్న ఆశతో కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టిన రైతులు.. ఇళ్ల వద్ద ఉన్న మీడియం, లోగ్రేడ్‌ బేళ్లను వేలానికి తెస్తూ వాటిని వ్యాపారులు కొనుగోలు చేయక వెనక్కి తీసుకెళ్తూ అవస్థ పడుతున్నారు.


నేడు మంత్రుల ప్రత్యేక సమావేశం

పొగాకు మార్కెట్‌లో పరిస్థితిని గుర్తించి జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పక్షం క్రితం ఒంగోలు-1 వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒంగోలు-2 కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్‌ అన్సారియా సైతం వేలం తీరును ప్రత్యక్షంగా చూశారు. ఇతర పార్టీల, రైతు సంఘాల నాయకులు వేలం కేంద్రాలను సందర్శిం చారు. ఈనేపథ్యంలో పొగాకు మార్కెట్‌పై అధికార టీడీపీ మరింత దృష్టి పెట్టింది. తదనుగుణంగా సోమవారం ఒంగోలులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డాక్టర్‌ స్వామిలు ఈ అంశంపై సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకాశం భవన్‌లో జరిగే సమావేశానికి బోర్డు అధికారులు, వ్యాపార, రైతు ప్రతినిధులు హాజరు కానున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు పాల్గొనను న్నారు. పాల్గొననున్నారు.ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అందులో వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని రైతులకు మేలు చేకూరేలా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 12 , 2025 | 01:52 AM