నల్లబర్లీ పొగాకు కొనుగోళ్ల గడువు పొడిగింపు
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:19 PM
నల్లబర్లీ పొగాకు రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వచ్చేనెల 10వ తేదీ వరకు కొనుగోళ్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిందని జేసీ గోపాలకృష్ణ చెప్పారు.
వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం
కొనుగోళ్లను పటిష్టంగా చేపట్టాలి : జేసీ గోపాలకృష్ణ
ఒంగోలు కలెక్టరేట్, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : నల్లబర్లీ పొగాకు రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వచ్చేనెల 10వ తేదీ వరకు కొనుగోళ్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిందని జేసీ గోపాలకృష్ణ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్ గురువారం జిల్లా స్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సభ్యుల సమావేశంలో నల్లబర్లీ పొగాకు కొనుగోలుపై సమీక్షించి పలు అంశాలను ఆమోదించారు. గడువు పొడిగింపునకు అనుగుణంగా మార్క్‌ఫెడ్ ద్వారా నల్లబర్లీ కొనుగోలు చేయాలన్నారు. తొలి విడతలో ఒక రైతు నుంచి 2 మెట్రిక్ టన్నులు లేదా 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందన్నారు. తక్కువ నుంచి ఎక్కువ క్వింటాళ్లు కలిగిన రైతులను గుర్తించి ఆరోహణ క్రమంలో 20 క్వింటాళ్లకు మించకుండా కొనుగోలు చేయాలని చెప్పారు. జిల్లాలో 800 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు జిల్లాలో 5.64 కోట్ల విలువైన 677 మెట్రిక్ టన్నుల పొగాకును 245 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. ఎక్కడైనా కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదనలు పంపితే ఆమోదిస్తామని చెప్పారు. 20శాతానికి మించి తేమ శాతం ఉండరాదని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పూర్తి మార్గదర్శకాలు వచ్చేంత వరకు గోడౌన్లలో నిల్వ ఉంచిన పొగాకు నాణ్యతను గోడౌన్ మేనేజర్‌కు, సొసైటీ ఇన్‌చార్జికి అప్పగించినట్లు జేసీ చెప్పారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం శ్రీహరికృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి ఇందిరాదేవి, వ్యవసాయశాఖ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, మార్కెటింగ్, ఎస్‌డబ్ల్యూసీ, సీడబ్ల్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు.