పొగాకు ధరలు పతనం
ABN , Publish Date - Oct 02 , 2025 | 02:18 AM
దక్షిణాది పొగాకు మార్కెట్ తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న వేళ ధరలు పెరగాల్సిందిపోయి దిగజారుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి గరిష్ఠ ధరలను దిగ్గోస్తున్నారు. వారం రోజులుగా సగటున కిలోకు రూ.15నుంచి రూ.20 మేర ధరలు తగ్గించి వేశారు.
వారంలో కిలోకు రూ.15నుంచి 20తగ్గిన గరిష్ఠ ధరలు
కొండపిలో రైతుల నిరసన.. ఆగిసాగిన వేలం
ఒంగోలు-2లో వేలాన్ని పరిశీలించి ఈడీ విశ్వశ్రీ
పలు సమస్యలను వివరించిన రైతుప్రతినిధులు
కంపెనీల ప్రతినిధులతో బోర్డు అధికారుల భేటీ
ఒంగోలు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్ తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న వేళ ధరలు పెరగాల్సిందిపోయి దిగజారుతున్నాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి గరిష్ఠ ధరలను దిగ్గోస్తున్నారు. వారం రోజులుగా సగటున కిలోకు రూ.15నుంచి రూ.20 మేర ధరలు తగ్గించి వేశారు. నెల క్రితం వరకు దక్షిణాదిలో కిలో గరిష్ఠ ధర రూ.280 ఉండగా క్రమంగా తొలుత రూ.300, తర్వాత రూ.330.. అలా వారం క్రితం వరకూ రూ.346కు పెంచి వ్యాపారులు ఇచ్చారు. దీంతో రైతుల్లో కాస్తంత ఉత్సాహం కనిపించింది. అయితే వారంలోనే వారి ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు పతనం దిశగా సాగుతున్నాయి. అత్యధిక శాతం మేలు రకం బేళ్లను కిలో రూ.320 నుంచి రూ.325 లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంకా తగ్గుతాయన్న సంకేతాలను కూడా బయ్యర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయమై బుధవారం కొండపి వేలం కేంద్రంలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.
కొనుగోళ్లను పరిశీలించిన ఈడీ విశ్వశ్రీ
పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ బుధవారం ఒంగోలు-2 వేలం కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో కొంతసేపు సమావేశమయ్యారు. దిగజారుతున్న గరిష్ఠ ధరల విషయాన్ని రైతు ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పొగాకు కొనుగోలు చేస్తున్న వివిధ కంపెనీల బయ్యర్లతో స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. బోర్డు ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు, ఒంగోలు ఆర్‌ఎం రామారావు ఈ సమావేశాన్ని నిర్వహించి వేలం ప్రక్రియకు ఆటంకం కలగకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.