Share News

పొగాకు మార్కెట్‌ తిరోగమనం

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:59 PM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ తిరగోమనంలో నడుస్తోంది. గత నెలలో కొద్దిరోజులపాటు ఒకింత పోటీపడి ధరలు పెంచిన వ్యాపారులు తిరిగి వాటిని తగ్గించేశారు. పది రోజుల్లోనే కిలోకు సుమారు రూ.30 మేర గరిష్ఠ ధరలు పడిపోయాయి.

పొగాకు మార్కెట్‌ తిరోగమనం

పది రోజుల్లో కిలో రూ.346నుంచి రూ.315కు దిగజారిన గరిష్ఠ ధర

ఇంకా తగ్గితే తీవ్రంగా నష్టపోతామని రైతుల ఆవేదన

ఇళ్లలోనే నాల్గోవంతు పంట

వచ్చేనెల 15వరకు వేలం సాగే అవకాశం

ధరల కన్నా కొనుగోళ్ల పూర్తిపై బోర్డు దృష్టి

దక్షిణాది పొగాకు మార్కెట్‌ తిరగోమనంలో నడుస్తోంది. గత నెలలో కొద్దిరోజులపాటు ఒకింత పోటీపడి ధరలు పెంచిన వ్యాపారులు తిరిగి వాటిని తగ్గించేశారు. పది రోజుల్లోనే కిలోకు సుమారు రూ.30 మేర గరిష్ఠ ధరలు పడిపోయాయి. ఇంకా తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలు వ్యాపారుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న తాము గరిష్ఠ ధరలు మరింత పతనమైతే అప్పులు మూటకట్టుకోక తప్పదని రైతులు వాపోతున్నారు. రైతులు పండించిన మొత్తం పంటలో ఇప్పటి వరకూ 75శాతం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇంకా రైతుల వద్ద 25శాతం వరకూ ఉంది. ఈ సమయంలో ధరలు పెంచి కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు అందుకు భిన్నంగా క్రమంగా తగ్గించి వేస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒంగోలు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాదిలో గత రెండు సీజన్‌లు పొగాకుకు ఊహించని స్థాయిలో ధరలు లభించాయి. కారణాలు ఏమైనా పంట నాణ్యతను కూడా పట్టించుకోకుండా భారీగా ధరలు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేశారు. అలా 2022-23 సీజన్‌లో సగటున కిలోకు రూ.237, 2023-24లో సగటున కిలోకు రూ.267 ధర లభించింది. ఒక రకంగా డిమాండ్‌, సప్లయ్‌ సూత్రానికి భిన్నంగా మార్కెట్‌ నడిచింది. పంట ఉత్పత్తి అనుమతించిన దాని కన్నా ఎక్కువ జరిగినప్పటికీ వ్యాపారులు అధిక ధరలను ఇచ్చి కొనుగోలు చేశారు. దీంతో 2024-25 సీజన్‌ (ప్రస్తుత కొనుగోలు జరుగుతున్న)లో దక్షిణాది ప్రాంత రైతులు భారీ పెట్టుబడులు పెట్టి పొగాకు సాగు చేశారు.

గతంతో పోల్చితే సగటున ఒక్కో బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు అదనంగా ఖర్చు చేశారు. పంట ఉత్పత్తి కూడా అధికంగానే జరిగింది.

55 మిలియన్‌ కిలోలు అధికంగా పంట ఉత్పత్తి

దక్షిణాదిలోని 11వేలం కేంద్రాలలో 2024-25 సీజన్‌కు 105 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. రైతులు ఇంచుమించు 160 మిలియన్‌ కిలోలు పండించినట్లు అంచనా వేశారు. ఈ ఏడాది మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 118 మిలియన్‌ కిలోలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సగటున కిలోకు రూ.230 మేర ధర లభించింది. తొలుత కిలోకు గరిష్ఠంగా రూ.280 ఇచ్చిన వ్యాపారులు దాదాపు ఆగస్టు ఆఖరు వరకు అదే ధరను కొనసాగించారు. ఆతర్వాత ఒక్కసారిగా గరిష్ఠ ధర కిలోను రూ.300 చేసి క్రమంగా పెంచుతూ సెప్టెంబరు రెండో పక్షం నాటికి రూ.346కు తీసుకెళ్లారు. దీంతో రైతులు ఒకింత ఆనందం వ్యక్తం చేశారు. మేలురకం బేళ్లను అధికంగా వేలం కేంద్రాలకు తెచ్చారు. అయితే పది రోజులు మాత్రమే ఆ ధరలు ఇచ్చిన వ్యాపారులు మళ్లీ తగ్గించి వేస్తున్నారు.

తగ్గుతున్న గరిష్ఠ ధరలు

గరిష్ఠ ధరలు పదిరోజులుగా తగ్గిపోతున్నాయి. గత నెల 24న కిలో రూ.346, 25న రూ.340, 30న రూ.331, ఈనెల 3న రూ.326, 4వ తేదీన రూ.315కు ధరలు దిగజారాయి. అలా పదిరోజుల వ్యవధిలో కిలోకు రూ.30 మేర పతనమైంది. ఇక కనిష్ఠ ధరలు కూడా పడిపోయాయి. కిలో రూ.70నుంచి 80కి కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రభావంతో సగటు ధరలు తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు కిలో సగటు ధర రూ.230 వరకూ ఉంది. మార్కెట్‌ తగ్గుతూ పోతే వేలం పూర్తయ్యే నాటికి మరో రూ.20 వరకు పడిపోయే అవకాశం ఉంది. అంటే రెండేళ్ల నాటి సగటు ధర (కిలో.237) కన్నా దాదాపు కిలోకు రూ.25వరకు తగ్గి ఆమేర తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పట్టించుకోని బోర్డు అధికారులు

పొగాకు బోర్డు అధికారులు మాత్రం ధరల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వేలం ప్రారంభించి దాదాపు ఏడు మాసాలు గడుస్తుండగా ఇంకా నాల్గో వంతు పంట రైతుల వద్దనే ఉంది. ఈ మొత్తం కొనుగోలుకు మరో నెలన్నర పట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో ధరల సంగతి ఎలా ఉన్నా వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో బోర్డు అధికారులు వ్యాపారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితితో ఈ ఏడాది అప్పులు మూటకట్టకోకతప్పదని రైతులు వాపోతున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:14 PM