ముగిసిన పొగాకు వేలం
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:01 PM
పొదిలిలోని పొగాకు వేలం కేంద్రం నిర్వహణ 208 రోజులు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగి గురువారంతో ముగిసింది. చిన్నచిన్న అవాంతరాలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి.
పొదిలి వేలం కేంద్రంలో రూ.304.23 కోట్ల మేర కొనుగోలు
అనుమతి ఇచ్చింది 11.11 మిలియన్లు
కొనుగోలు చేసింది 15.04 మిలియన్లు
పొదిలి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : పొదిలిలోని పొగాకు వేలం కేంద్రం నిర్వహణ 208 రోజులు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగి గురువారంతో ముగిసింది. చిన్నచిన్న అవాంతరాలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి. వేలం కేంద్రం పరిధిలో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, తర్లుపాడు, దొనకొండ, కురిచేడు, కంభం, గిద్దలూరు, పెదారవీడు, అర్ధవీడు, బేస్తవారిపేట, మార్కాపురం, తాళ్లూరు మొత్తం 13 మండలాల రైతులు వేలంలో పాల్గొన్నారు. వేలం కేంద్రం పరిధిలో 2400 బ్యారన్‌లు, 5000 మంది రైతులు ఉన్నారు. అందుకుగాను ప్రభుత్వం అధికారికంగా 11.11 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. వేలం ముగిసే సమయానికి 15.04 మిలియన్ల పొగాకు అమ్మకానికి వచ్చినట్లు వేలం నిర్వహణ అధికారి గిరిరాజ్‌కుమార్ తెలిపారు. మొత్తం రూ.304కోట్ల 23లక్షల, 52వేల రూపాయలు అమ్మకం జరిగినట్లు ఆయన చెప్పారు. గత నాలుగేళల్లో అత్యధికంగా ఈ ఏడాది పొగాకు సాగు చేశారన్నారు. గతేడాది తుఫాన్ ధాటికి కురిసిన వర్షాలకు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఎక్కువ శాతం లోగ్రేడ్ వచ్చిందన్నారు. మిగిలిన వేలం కేంద్రాలకంటే పొదిలిలో ఎక్కువ లోగ్రేడ్ వచ్చిందన్నారు. సరాసరి ధర రూ.202.18రాగా అత్యధిక ధర రూ.366, కనిష్ట ధర రూ.50గా ఉందని ఆయన చెప్పారు. వేలంలో మొత్తం 36 కంపెనీలు పాల్గొన్నాయన్నారు.