Share News

గంజాయిని తరలిస్తున్న ముగ్గురు అరెస్టు

ABN , Publish Date - May 19 , 2025 | 11:47 PM

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లికార్జున చెప్పారు

గంజాయిని తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జున

2.150 కేజీలు స్వాధీనం

కంభం, మే 19 (ఆంధ్రజ్యోతి) : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మల్లికార్జున చెప్పారు. సోమవారం సాయంత్రం కంభం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జున మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలం జిలిగాం గ్రామానికి చెందిన మామిళ్ల శ్రీనివాసులు, కృష్ణా జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన వీరిశెట్టి వెంకటేష్‌, కంభం మండలం శీలంవీధికి చెందిన గంటా నవీన్‌ నిత్యం గంజాయి సేవించేవారు. గంజాయికి అలవాటుపడ్డ ఈ ముగ్గురు వైజాగ్‌కు చెందిన ఓ సాధువు వద్ద నుంచి గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి గంటా నవీన్‌ ద్వారా కంభం, బేస్తవారపేట మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుని ఎక్కువ లాభాలు పొందేందుకు పథకం వేశారు. ఈక్రమంలో ఈనెల 14న విశాఖ నుంచి 2 కిలోల గంజాయిని తెచ్చి బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామంలోని ముక్తేశ్వరస్వామి గుడి వద్ద ఉన్న మామిళ్ల శ్రీనివాసులుకు కిలో రూ.8వేల చొప్పున అమ్మాడు. ఆ గంజాయిని గుడి వద్ద ప్యాక్‌ చేస్తే చెడ్డ పేరు వస్తుందని భావించిన శ్రీనివాసులు, వీరిశెట్టి వెంకటేష్‌, గంటా నవీన్‌ గంజాయిని కంభం తీసుకొచ్చి చిన్న చిన్న ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి విక్రయించాలని భావించారు. దీంతో రావిపాడు పొలాల్లోని చెట్ల కింద పొట్లాలు కట్టాలని ఆటోలో తీసుకుని వెళ్తుండగా కంభం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గమనించిన ఆ ముగ్గురు ఆటో దిగి నడిచి వెళ్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద 2.150 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు ముగ్గురినీ తహసీల్దార్‌ వద్ద హాజరుపరచి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు, సిబ్బంది రమేష్‌, పీరయ్య, శివయ్య, లాజర్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 11:47 PM