ఆ మూడు మండలాలు యథాతథం
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:29 PM
జిల్లాల పునర్విభజనలో భాగంగా పొదిలి, దొనకొండ, కురిచేడు మండలాల విషయంలో ప్రాథమిక నోటిఫికేషన్‌కు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఆమేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుకు తుది నిర్ణయాన్ని తెలియజేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌లో పొదిలిని మార్కాపురం నియోజకవర్గంలో ఉంచాలని, దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయం
నేడు కేబినెట్‌లో తుది నిర్ణయం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
జిల్లాల పునర్విభజనలో భాగంగా పొదిలి, దొనకొండ, కురిచేడు మండలాల విషయంలో ప్రాథమిక నోటిఫికేషన్‌కు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఆమేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుకు తుది నిర్ణయాన్ని తెలియజేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌లో పొదిలిని మార్కాపురం నియోజకవర్గంలో ఉంచాలని, దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. వాటిపై వచ్చిన అభ్యంతరాలు, వినతులను శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం దృష్టికి మంత్రివర్గ ఉపసంఘం తీసుకెళ్లిన విషయం విదితమే. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చాలని కొన్ని విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని లోతైన అధ్యయనం చేసి ఆదివారం సాయంత్రానికి నిర్ణయం తెలియజేయాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. దీంతో మంత్రివర్గ ఉపసంఘం ప్రధాన బాధ్యులైన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మరోవైపు అధికారులు ఆదివారం మధ్యాహ్నం వరకు పరిశీలన చేశారు. ముఖ్యంగా గ్రామస్థాయి వరకు పరిస్థితిని సమీక్షించారు. మేధావులు, విద్యావంతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ ప్రకారం వీలైనంత వరకు ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలో ఉంచాలన్న ప్రాతిపదిక, అంతకుమించి రెవెన్యూ డివిజన్ అందుబాటులో ఉండే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. తదనుగుణంగా ప్రాథమిక నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పొదిలి మండలాన్ని మార్కాపురం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలన్న అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినట్లు తెలిసింది. అదే అంశాన్ని ఆదివారం సాయంత్రం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున అప్పటి వరకు అధికారిక నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.