ఆ ఐదు పనులే!
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:21 AM
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేసి రిజర్వాయర్‌లోకి కృష్ణా నీటిని పంపాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. నీటిని నింపాలంటే ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, తరలింపు అత్యంత అవశ్యం.
వెలిగొండ తొలిదశ పూర్తికి అవే కీలకం
ప్రాజెక్టు అధికారుల గుర్తింపు
సీఎం ఆదేశాలతో వాటిపై ప్రత్యేక దృష్టి
వివిధ దశల్లో రెండో టన్నెల్ లైనింగ్
టెండర్ల దశలో ఫీడర్ కాలువ నవీకరణ
నె లాఖరుకు కొలిక్కిరానున్న ప్రక్రియ
పునరావాసం ప్రత్యేక అంశం
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేసి రిజర్వాయర్‌లోకి కృష్ణా నీటిని పంపాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. నీటిని నింపాలంటే ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, తరలింపు అత్యంత అవశ్యం. అది ప్రాజెక్టు పనులకు భిన్నమైన అంశం కావడంతో రెవెన్యూ యంత్రాంగం నేతృత్వంలో ప్రత్యేక అధికారులు ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల్లో పెండింగ్‌లో ఉన్నవి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఒంగోలు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజె క్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకు సంబం ధించి దాదాపు రెండు మాసాలుగా వివిధ స్థాయిల్లోని అధికారులు కసరత్తు చేసి ఐదు పనులు కీలకమైనవిగా గుర్తించారు. వాటి పూర్తికి ప్రణాళికాబద్ధ చర్యలపై దృష్టిసారిం చారు. అందులో రెండో టన్నెల్ లైనింగ్ పనులతోపాటు మరో మూడు వివిధ దశల్లో ఉన్నాయి. ఫీడర్ కాలువ ఆధునికీకరణ టెండర్ల దశలో ఉంది. కాగా నల్లమల అట వీ ప్రాంత సమీపంలోని గొట్టిపడియ, సుంకే శుల, కాకర్ల వద్ద కొండల మధ్య గ్యాప్‌లలో డ్యాంల నిర్మాణం ద్వారా నల్లమల రిజర్వా యర్ ఏర్పడుతుంది. సుమారు 53.39 టీఎంసీల సామర్థ్యం ఉండే ఈ రిజర్వాయ ర్‌కు శ్రీశైలం ఎగువ ప్రాంతంలోని కొల్లం వాగు ప్రాంతం నుంచి కృష్ణానది నీటిని 18.80 కి.మీ రెండు టన్నెళ్ల ద్వారా దోర్నాల మండలం కొత్తూరు దగ్గరకు తెస్తారు. అక్కడి నుంచి 21.80 కి.మీ ఫీడర్ కాలువ ద్వారా రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కాలువ, తీగలేరు కాలువల ద్వారా 4.34 లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు ఇస్తారు. తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 8 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. తొలిదశ పూర్తిచేసి నీరు ఇవ్వాలంటే డ్యామ్‌లు నిర్మించి రిజర్వాయర్ ఏర్పాటు, ఫీడర్ కాలువ, టన్నెల్ పనులు పూర్తి చేయాలి. రిజర్వాయర్ నుంచి మూడు కాలువలకు నీరు తీసుకునే పాయింట్ వద్ద గేట్లు, ఇతర ఏర్పాట్లు పూర్తిచేయాలి.
నిధుల విడుదలకు భరోసా
ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం అంచనా వేయగా ఇప్పటివరకు రూ.6వేల కోట్లు ఖర్చుచేశారు. తొలిదశ పూర్తికి రూ.2,050 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆ నిఽధులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చి వచ్చే ఏడాది ఆగస్టుకు తొలిదశ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో పెండింగ్ పనులపై ప్రాజెక్టు అధికారులు దృష్టిసారించారు. మూడు చోట్ల డ్యామ్‌ల నిర్మాణం ద్వారా రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. టన్నెల్ తవ్వకాలు, హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం, ఫీడర్ కాలువ తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. అయితే దశాబ్దన్నర క్రితం తవ్విన ఫీడర్ కాలువ ప్రస్తుతం దెబ్బతింది.. దానిని ఆధునికీకరించాలని అధికారులు నివేదించడంతో ఆ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే టన్నెళ్ల తవ్వకం పూర్తయినా రెండో సొరంగంలో సుమారు 4.50 కి.మీ లైనింగ్ చేయాల్సి ఉంది. అలా ఫీడర్ కాలువ బాగు, రెండో టన్నెల్ లైనింగ్‌తోపాటు కాకర్ల గ్యాప్ నుంచి లోయలోకి వెళ్లే గ్రామాల రోడ్డు మూసివేయడంతో ఆ ప్రాంతంలో ఉండే పది గ్రామాల వారు బయటకు వచ్చేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించాల్సి ఉంది. వీటితోపాటు తూర్పు ప్రధాన కాలువ కోసం రిజర్వాయర్ వద్ద 40మీటర్ల ఎత్తులో హెడ్ రెగ్యులేటరీ, తీగలేరు కాలువకు నీరిచ్చేందుకు రిజర్వాయర్ వద్ద గేట్ల నిర్మాణం చేయాలి. ఇలా ఐదు పనులను తొలిదశ ప్రాజెక్టు పూర్తిలో కీలకమైన పెండింగ్ పనులుగా అధికారులు గుర్తించారు.
ఫీడర్ కాలువ బాగుకు టెండర్లు
ఐదు కీలక పనులలో ఒకటైన ఫీడర్ కాలువ ఆధునికీకరణకు రూ.370 కోట్లతో టెండర్లను పిలిచారు. ఈ నెలాఖరులోపు ఆ ప్రక్రియ పూర్తయి అనంతరం పనులు చేపట్టే అవకాశం ఉంది. ఇందులో 21.80 కి.మీ లైనింగ్, మూడుచోట్ల 5.32 కి.మీ కాంక్రీటు గోడల పనులు ప్రధానం. కాంక్రీటు గోడలు సకాలంలో పూర్తిచేస్తే లైనింగ్ పని మిగిలి ఉన్నప్పటికీ నీటిని ఇవ్వవచ్చని సమాచారం. రెండో టన్నెల్ లైనింగ్ పనులు 4.50 కి.మీ చేయాల్సి ఉండగా గ్యాంట్రీ విధానంలో వాటిని చేపడుతున్నారు. ప్రస్తుతం రెండు చోట్ల విడివిడిగా యంత్రాలతో పెడుతుండగా.. మరో రెండు చోట్ల కూడా యంత్రాలు పెట్టి త్వరితగతిన పూర్తికి చర్యలు చేపడుతున్నారు. తూర్పు ప్రధాన కాలువకు రిజర్వాయర్ నుంచి నీటిని ఇచ్చే హెడ్ రెగ్యులేటరీని సుమారు 40 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 10 మీటర్ల ఎత్తు నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి పది మీటర్లకు ఒకసారి కాంక్రీటు వేసేలా చర్యలు చేపట్టారు.