ఈసారి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:09 AM
ఈ విడత స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాలను ప్రధానాంశంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పేరుతో ఒక్కో అంశంపై ప్రజలను చైతన్యవంతులను చేయడం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న విషయం విదితమే.
నేడు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు
ఒంగోలు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఈ విడత స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత అంశాలను ప్రధానాంశంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పేరుతో ఒక్కో అంశంపై ప్రజలను చైతన్యవంతులను చేయడం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న విషయం విదితమే. అందులోభాగంగా ఈ శనివారం వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది. ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిషేధం, చేతులు శుభ్రపర్చుకోవడంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. విద్యా సంస్థల్లో ఈ కార్య క్రమాలను విధిగా చేపట్టాలని స్పష్టం చేసింది. ఇతరచోట్ల కూడా ఎక్కువమంది ఒకేచోట పనిచేసే ప్రదేశాల్లోనూ నిర్వహించాలని ఆదేశించింది. అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టడం, బహిరంగ మల, మూత్ర విసర్జన వలన అనర్థాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను అధికారులు చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించనున్నారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.