ఇదేం వాన!
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:25 AM
రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా జిల్లాలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. వారం నుంచి ఏరోజుకారోజు సాయంత్రానికి జల్లులు పడుతున్నా అవి కొద్దిప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.
కొన్ని మండలాల్లో సగం వర్షం కూడా కురవలేదు
నాల్గో వంతు ప్రాంతాల్లో పదిశాతం లోపుగానే...
ఈ నెలలో ఇప్పటివరకు 38.0శాతం లోటు వర్షపాతం
వ్యవసాయ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా జిల్లాలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. వారం నుంచి ఏరోజుకారోజు సాయంత్రానికి జల్లులు పడుతున్నా అవి కొద్దిప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. ఎక్కువ చోట్ల వర్షాభావం నెలకొంది. జిల్లాలోని మూడొంతుల మండలాల్లో ఈ నెలలో ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం కన్నా తక్కువగానే నమోదైంది. ఇంచుమించు సగం మండలాల్లో సాధారణంలో 50శాతం కూడా పడలేదు. ఈ ప్రభావం ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలపై చూపుతోంది. అది రబీ సాగుపైనా పడే అవకాశం కనిపిస్తోంది.
ఒంగోలు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఏడాది మొత్తంలో అత్యధిక వర్ష పాతం నమోదయ్యేది అక్టోబరులోనే. ఉమ్మ డిగా ఉన్న సమయంలో వార్షిక వర్షపాతం 871.50 మి.మీ కాగా విభజన అనంతరం మిగిలి ఉన్న ప్రస్తుత జిల్లాలో అది 679.8కి పడిపోయింది. అంటే మంచి వర్షాలు కురిసే ప్రాంతాలు అధికం ఇతర జిల్లాల్లో కలిసిపోయాయి. వర్ష పాతం తక్కువగా ఉండే పశ్చిమప్రాంతం ప్రస్తుత జిల్లాలో మిగిలిపోయింది. ప్రస్తుత జిల్లాలో వార్షిక సాధారణ వర్షపాతం 679.80 మి.మీ కాగా అందులో అత్యధికంగా 205 మి.మీ అక్టోబరులో కురుస్తుంది. అంటే ఏడాది మొత్తంలో ఇంచుమించు 30శాతం వర్షపాతం ఈనెలలోనే ఉంటుంది. అంతేకాక ఈ సమయానికి ఖరీఫ్‌లో వేసిన పైర్లు పంటకు రావడంతోపాటు రబీ పంటల సాగు ముమ్మరంగా సాగుతుంది. వ్యవసాయ సీజన్లకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ నెలలో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈనెలలో ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతంలో దాదాపు 38శాతం లోటు కనిపిస్తోంది. అక్టోబరు మొత్తం సాధారణ వర్షపాతం 205 మి.మీలలో ఈ రెండు వారాల్లో 89.70 మి.మీ కురవాల్సి ఉంది. అయితే 55.60 మి.మీ వర్షపాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదైంది. జిల్లాలో 39 మండలాలో కేవలం 8 మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా అధికంగా కురిసింది. మిగిలిన 31 మండలాల్లో తక్కువగానే ఉంది. వాటిలో 19 మండలాల్లో ఏకంగా 50శాతం నుంచి 94శాతం, మరో 9 మండలాల్లో 20 నుంచి 50శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం పంటలపై పడనుంది.
రబీపై తీవ్ర ప్రభావం
సాధారణంగా ఈ సమయంలో ఖరీఫ్ సీజన్‌లో వేసిన పైర్లు అత్యధిక భాగం పూత, పిందె, పొట్టదశల్లో ఉంటాయి. ఇప్పుడు కురిసే వర్షాలు వాటికి ఉపకరించి మంచి పంట దిగుబడి వస్తుంది. అలాగే రబీ ముమ్మరంగా సాగుతుంటుంది. అలా రెండు సీజన్లలో ఈనెలలో వర్షం అత్యంత కీలకం కాగా మూడొంతుల మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, సగం మండలాల్లో మరింత దారుణంగా పరిస్థితి నెలకొనడం వ్యవసాయ సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. సాగర్ కాలువల్లో నీరు జోరుగా వస్తుండటం, ఖరీఫ్ సీజన్‌లో పశ్చిమప్రాంతంలో మంచి వర్షాలు కురవడం కొంత ఊరట కలిగించినా తాజా పరిస్థితి రైతాంగంలో ఆందోళన కలిగిస్తోంది.