ఇదేం మార్పు!
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:20 AM
జిల్లా సహకారశాఖా ధికారి (డీసీవో)గా డి.శ్రీలక్ష్మి నియమితులయ్యారు. ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) డీసీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ఇందిరాదేవిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పూర్తి స్థాయి అధికారి నియామకం అవసరమే అయినప్పటికీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్ 51 విచారణ ప్రారంభ సమయంలో ఈ మార్పు జరగడం సహకార శాఖలో చర్చకు దారితీసింది.
జిల్లా సహకారాధికారిగా శ్రీలక్ష్మి
అదనపు బాధ్యతల నుంచి ఇందిరాదేవి తొలగింపు
డీసీసీబీపై విచారణ సమయంలో మార్పుతో అనుమానాలు
ఒంగోలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకారశాఖా ధికారి (డీసీవో)గా డి.శ్రీలక్ష్మి నియమితులయ్యారు. ఇప్పటి వరకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) డీసీవోగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ఇందిరాదేవిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పూర్తి స్థాయి అధికారి నియామకం అవసరమే అయినప్పటికీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్ 51 విచారణ ప్రారంభ సమయంలో ఈ మార్పు జరగడం సహకార శాఖలో చర్చకు దారితీసింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో కీలక శాఖల జిల్లా అధికారులు, అలాగే ఆయా శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమన్వయంతో సాగుతున్నా సహకారశాఖలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారే ఆ శాఖలో పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. వారికి వత్తాసుగా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు నిలిచారు. పలు సందర్భాలలో జిల్లాకు చెందిన అధికారపార్టీ కీలక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను వారు పట్టించుకోకపోవడం, చివరకు కలెక్టర్ సిఫార్సులను సైతం పక్కనపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ డీసీవోగా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై వివిధ రూపాలలో ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరాయి. అదేక్రమంలో డీసీసీబీలో విచారణ సమయంలో ఆయన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న కలెక్టర్ అన్సారియా మార్చి ఆఖరులో ప్రభుత్వ పెద్దల సూచనలతో శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు.
ఇన్‌చార్జి డీసీవోపై స్పందన కరువు
ఆ వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇక్కడి డీసీవోగా ఉన్న శ్రీనివాసరెడ్డిని సరెండర్ చేయడం, డీసీసీబీలో విచారణ, ఇతరత్రా అంశాల్లో జిల్లా యంత్రాంగం, ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఖరి నచ్చక వారు అలా వ్యవహరించారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కాగా స్థానికంగా పాలనాపరమైన అవసరాల కోసం ఏప్రిల్ రెండో పక్షంలో ఇక్కడి పీడీసీసీ బ్యాంకులో ఓఎస్‌డీగా ఉన్న ఇందిరాదేవిని ఇన్‌చార్జి డీసీవోగా కలెక్టర్ నియమించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అది కూడా నచ్చని వారు దాదాపు మూడు నెలలకుపైగా ఆ నియామకాన్ని ధ్రువీకరించకపోవడంతో చివరకు జిల్లా సహకారశాఖ కార్యాలయ ఉద్యోగులకు జీతాలు కూడా ఇందిరాదేవి ఇవ్వలేకపోయారు. ఈ పరిస్థితులపై పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడం, చివరకు జీతాల కోసం ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలకు దిగడం, ఇతరత్రా పరిణామాలతో మంత్రి డాక్టర్ స్వామి జోక్యంతో ప్రభుత్వ పెద్దలు స్పందించారు. ఇక చేసేదేమీ లేక ఇందిరాదేవికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఉద్యోగుల జీతాల సమస్య ను పరిష్కరించారు.
అంటీముట్టనట్లు విచారణ
ఇందిరాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించే సమయంలోనే ఇక్కడ రెగ్యులర్ డీసీవోని నియమించే అవకాశం ఉన్నా ఉన్నతాధికారులు అలా చేయలేదు. ప్రస్తుతం డీసీసీబీలో సెక్షన్ 51 విచారణ ప్రారంభమవుతున్న తరుణంలో మార్పు చేయడంపై సహకారశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. తొలుత డీసీసీబీలో సెక్షన్ 51 విచారణ అంశాన్ని ఉన్నతాధికారులు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ తరహాలో రాష్ట్రంలో వివిధ బ్యాంకులలో కూడా పలు ఆరోపణలు రాగా వాటిపై గత అసెంబ్లీ సమావేశాలలో చర్చ విస్తృతంగా సాగి సభాసంఘం నియామకం జరిగింది. మళ్లీ ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికైనా డీసీసీబీలో విచారణ చేపట్టకపోతే ప్రభుత్వ పెద్దల నుంచి ఇబ్బంది వస్తుందని భావించి సెక్షన్ 51 విచారణను ప్రాథమికంగా చేపట్టే చర్యలు తీసుకున్నారు. అందుకు విచారణాధికారిగా నియమితులైన గౌరీశంకర్ మంగళ, బుధవారాల్లో అంటీముట్టనట్లుగా విచారణ సాగించి వెళ్లిపోయారు. కాగా ఈ తరహా విచారణల సమయంలో జిల్లా స్థాయిలో సహకారశాఖ హెడ్‌గా ఉండే డీసీవో పాత్ర కీలకం.
కీలక సమయంలో మార్పు
ఇలాంటి సమయంలో ముక్కసూటి అధికారిణి, అందులోనూ ప్రస్తుతం బ్యాంకులో పెత్తనం చెలాయిస్తున్న, అలాగే రాష్ట్ర స్థాయిలో వారికి ఆశీస్సులు అందిస్తున్న ఉన్నతాధికారులతో సఖ్యత లేని అధికారి ఉంటే సమస్యగా ఉంటుందని సహకార శాఖలోని ఒక వర్గం ఉద్యోగులు, అధికారులు చక్రం తిప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఇందుకు ఇటు కీలక ప్రజాప్రతినిధులు, అటు ఉన్నతాధికారులపైనా ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ప్రస్తుతం డీసీవోగా ఎఫ్‌ఏసీ బాధ్యతలలో ఉన్న ఇందిరాదేవిని తప్పించి రెగ్యులర్ పోస్టు అయిన డీసీసీసీబీలోని ఓఎస్‌డీగా పంపించి ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డి.శ్రీలక్ష్మిని ఇక్కడ డీసీవోగా నియమించారు. ఆ మేరకు గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి, ఈ మొత్తం వ్యవహారంలో గత వైసీపీ పాలనలో ఐదేళ్లు ఇక్కడ సహకార శాఖలోని ఒక విభాగం జిల్లా అధికారిగా పనిచేసి ఇటీవల పొరుగు జిల్లాకు బదిలీ అయిన ఒక అధికారి, అలాగే అదే ప్రభుత్వంలో ఆధిపత్య సామాజికవర్గానికి చెంది ఇటీవల పదోన్నతి పొంది పొరుగు జిల్లాకు వెళ్లిన మరొక అధికారి కీలకంగా వ్యవహరించారన్న చర్చ సాగుతోంది.