ఏడాదిలో మూడోసారి
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:55 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇది మూడోసారి కాగా మూడు విడతలు పశ్చిమ ప్రాంతంలోనే పర్యటించడం విశేషం. అందులోనూ సీఎం గతంలో పాల్గొన్న రెండు, మంగళవారం పర్యటన కూడా రాష్ట్రస్థాయి కార్యక్రమాలే.
నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు
జి.లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రారంభం
పశ్చిమప్రాంతంపై ప్రత్యేక ఫోకస్
ఈసారి కూడా ఆ ప్రాంతంలోనే పర్యటన
పారిశ్రామిక ఉపాధి, సాగునీటి రంగాలకు భరోసా
ఇప్పటికే కీలక అంశాలపై దృష్టి
ముఖ్యమంత్రి కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన ఇది మూడోసారి కాగా మూడు విడతలు పశ్చిమ ప్రాంతంలోనే పర్యటించడం విశేషం. అందులోనూ సీఎం గతంలో పాల్గొన్న రెండు, మంగళవారం పర్యటన కూడా రాష్ట్రస్థాయి కార్యక్రమాలే. తొలుత ఈ ఏడాది మార్చి 8న అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం తరఫున మార్కాపురంలో నిర్వహించగా అందులో పాల్గొన్నారు. తర్వాత ఈ ఏడాది ఆగస్టు 3న దర్శి నియోజకవర్గంలోని తూర్పువీరాయపాలెం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రస్థాయి అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులను మంజూరు చేశారు. మూడోసారి మంగళవారం వస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం జి.లింగ న్నపాలెం వద్ద సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) పార్కు ప్రారంభోత్సవ కార్యక్ర మంలో ఆయన పాల్గొననున్నారు.
ఒంగోలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈవిడత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక, ఉపాధి రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు దేశ, విదేశాల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించి పెద్దఎత్తున పారిశ్రామిక సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయించడం ద్వారా ఉపాధి మార్గాల పెంపునకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి అక్కడి వనరుల ఆధారంగా చిన్న, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు.. తద్వారా ఉపాధి కల్పనపై దృష్టి సారించారు. ఈక్రమంలో ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీ రూపొందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారీ రాయితీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. గతంలో ఆయా ప్రాంతాల్లో మంజూరు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కులతోపాటు ఈ ఏడాది నియోజకవర్గానికి ఒక పార్కు ఏర్పాటుకు సంకల్పించారు. అలా రాష్ట్రంలో కొన్నిచోట్ల మంజూరు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కుల పనులు పూర్తి లేదా పురోగతిలో ఉండగా కొన్నింటికి భూములు గుర్తించి అభివృద్ధి పర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
వర్చువల్‌గా ప్రారంభం
ఎంఎస్‌ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే రాష్ట్రస్థాయి మెగా కార్యక్రమాన్ని పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు వద్ద నుంచి మంగళవారం సీఎం చంద్రబాబు పర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ మేరకు రెండు రోజుల క్రితం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు అధికారికంగా సమాచారం రావడంతో ఆగమేఘాలపై అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నీతానై పర్యవేక్షిస్తున్నారు. అక్కడ సీఎం కార్యక్రమం సుమారు రెండు గంటలపాటు సాగనుంది. ఇతర చోట్ల కార్యక్రమాలు నిర్వహించిన రీతిలోనే భారీ బహిరంగ సభలు లేకుండా పరిమిత సంఖ్యతోనే సభను నిర్వహించనున్నారు. తొలుత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.
పశ్చిమంపైనే ఫోకస్
ఈసారి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలోని పశ్చిమప్రాంతంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. అందువల్లనే ఈ ఏడాది ఇప్పటివరకు చేసిన రెండు పర్యటనలు, తాజాగా వస్తున్న కార్యక్రమానికి కూడా ఆ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. పారిశ్రామిక, ఉపాధి, సాగు, తాగునీరు వంటి సౌకర్యాల పెంపు ఆ ప్రాంతంలో విస్తారంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశ్చిమప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొద్దిరోజుల్లోనే అది సాకారం కానుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిపై ప్రజల్లో నమ్మకం కలిగింది. వచ్చే ఏడాది ఆగస్టుకు తొలిదశ, తద్వారా పశ్చిమ ప్రాంతంలో కరువు నివారణ, శాశ్వతంగా సాగు, తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. ఇక దొనకొండ కారిడార్ ప్రాంతంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా వేగంగా చర్యలు కనిపిస్తున్నాయి. కనిగిరి కేంద్రంగా పునరుత్పాదక ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి వాటిని విస్తరించే ప్రయత్నాలు, పలు మండలాల్లో వాటి ఏర్పాటుకు చర్యలు సాగుతున్నాయి. ఇక కనిగిరి నియోజకవర్గంలోని జి.లింగన్నపాలెం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు వద్ద నుంచి రాష్ట్రంలో ఆ తరహా పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ద్వారా పశ్చిమప్రాంత ప్రజల ఉపాధికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉండగా నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు ప్రభుత్వ విధానం కాగా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పార్కులకు కూడా ఇదేసమయంలో శంకుస్థాపనలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం పర్యటన 2.15 గంటలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈసారి జిల్లా పర్యటన కొద్ది సమయం మాత్రమే ఉండనుంది. అది కూడా అధికారిక కార్యక్రమానికే పరిమితం కానుంది. ఆయన కేవలం 2.15 గంటలు మాత్రమే పీసీపల్లి మండలం జి.లింగన్నపాలెంలో ఉండనున్నారు. ఉదయం 10.15 గంటలకు జిల్లాకు చేరుకునే సీఎం తిరిగి 12.30కు వెళ్లిపోనున్నారు. జి.లింగన్నపాలెంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోని ఎంఎస్‌ఎంఈ పార్కుతోపాటు వర్చువల్‌గా రాష్ట్రంలోని 50 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. తిరిగి హెలికాప్టర్‌లో వెళ్లిపోతారు. అలా మొత్తం కార్యక్రమం 2.15 గంటలు మాత్రమే కాగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో అటు అధికారులు, ఇటు స్థానిక టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పర్యవేక్షణలో మొత్తం 879 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఇద్దరు ఏఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతోపాటు 800మంది పోలీసులు, హోంగార్డులు విధుల్లో పాల్గొననున్నారు. కాగా ఎస్పీ నేతృత్వంలో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం, పైలాన్, సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్‌లో రానుండగా సోమవారం హెలికాప్టర్ కూడా ట్రయల్ రన్ నిర్వహించారు.