Share News

మూడో విడత స్వామిత్వ సర్వే ప్రారంభం

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:37 AM

జిల్లాలో మూడో విడత స్వామిత్వ సర్వే ప్రారంభమైంది. గ్రామాల్లోని ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 508 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు రెండు విడతల స్వామిత్వ సర్వే నిర్వహించారు.

మూడో విడత స్వామిత్వ సర్వే ప్రారంభం
స్వామిత్వ సర్వేను పరిశీలిస్తున్న డీపీవో వెంకటేశ్వరరావు (ఫైల్‌)

ఇప్పటికే జిల్లాలో రెండు విడతలు పూర్తి

ఈ దఫా 157 గ్రామాల్లో కొలతలు

ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కుల కల్పనే లక్ష్యం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మూడో విడత స్వామిత్వ సర్వే ప్రారంభమైంది. గ్రామాల్లోని ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 508 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు రెండు విడతల స్వామిత్వ సర్వే నిర్వహించారు. తొలి విడత 54 గ్రామాలు, రెండో విడత 297 గ్రామాల్లో చేపట్టారు. అలా ఇప్పటివరకు 351 గ్రామాల్లో పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మూడో విడతలో మిగిలిన 157 గ్రామాల్లో సర్వే చేసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజానీకం ఉంటున్న ఇళ్లు, స్థలాలకు సంబంధించి చాలా మందికి ఎలాంటి హక్కులు లేవు. అయితే ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఉన్న ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టింది. అందులో భాగంగా గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు, దుకాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఈ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి గ్రామాల్లోని ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించి అందుకు అవసరమైన ప్రాపర్టీ కార్డులను జారీచేయనున్నారు. మూడో విడత సర్వే జరగనున్న గ్రామాల్లో కుటుంబాల వారీగా స్వామిత్వ సర్వే చేసేందుకు యజమానులకు నోటీసులు జారీచేయనున్నారు. ఆ మేరకు ఇల్లు, స్థలాలకు కొలతలు వేసి రికార్డుల్లో నమోదు చేస్తారు. ఆ కొలతల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకునే అవకాశాన్ని యజమానులకు కల్పించారు. ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న ఆస్తులకు ఇంటి పన్నులు వంటివి చెల్లిస్తున్నా వాటిపై ఎలాంటి హక్కులు లేవు. ప్రస్తుతం జరుగుతున్న స్వామిత్వసర్వేలో ఆ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేస్తారు. అలా నమోదు చేయడం ద్వారా ఆ ఆస్తులను ఏదైనా అత్యవసరం ఉంటే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో మూడో విడత సర్వేను సకాలంలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Dec 03 , 2025 | 02:37 AM