తాళంవేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:59 PM
తాళంవేసిన ఇంటిని దుండగులు టార్గెట్ చేశారు. ఇంటిలో ఎవరూ లేనిసమయంలో ఇంటి తలుపు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాతాళం పగలకొట్టి అందులో ఉన్న రూ.1.10 లక్షలు నగదు, రెండు జతల వెండి పట్టీలను అపహరించుకొని పోయారు.
బీరువా పగలకొట్టి రూ.1.10 లక్షల నగదు అపహరణ
సింగరాయకొండ, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : తాళంవేసిన ఇంటిని దుండగులు టార్గెట్ చేశారు. ఇంటిలో ఎవరూ లేనిసమయంలో ఇంటి తలుపు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాతాళం పగలకొట్టి అందులో ఉన్న రూ.1.10 లక్షలు నగదు, రెండు జతల వెండి పట్టీలను అపహరించుకొని పోయారు. ఈ సంఘటన స్థానిక ప్రశాంతి హాలు ఎదరుగా ఉన్న బజారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. సింగరాయకొండ ప్రశాంతి హాలు సెంటర్‌గా ఉన్న వీధిలో పఠాన్ రఫీ వెల్డింగ్ పనిచేస్తూ జీవనం గడపుతూ ఉంటారు. మోహరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈతమొక్కల బంధువుల ఇంటికి వెళ్లారు. మరలా తిరిగి పఠాన్ రఫీ బుధవారం సాయంత్రం ఒక్కరే ఇంటికి వచ్చారు. అనంతరం స్నానంచేసి పనిమీద బయటకు వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చారు. గేటుకు వేసిన తాళం పగలకొట్టి ఉండటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోపలివెళ్లి చూడగా ఇంటితాళం, బీరువాతాళం పగలకొట్టి అందులో ఉన్న నగదు రూ.1.10 లక్షలు, వెండి పట్టీలు దోచుకెళ్లారు. సమాచారం అందుకొన్న పోలీసులు డ్వాగ్ స్క్వాడ్, వేలిముద్రల సేకరణ బృందాలను రంగంలోకి దింపారు. పఠాన్ రఫీ ఫిర్యాదు మేరకు ఏఎస్సై శేషారెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.