ఒంగోలు లో దొంగలు హల్‌చల్
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:52 PM
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలోని రాజీవ్‌నగర్‌లో నాలుగు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడి సుమారు రూ.8 లక్షలు విలువైన సొత్తును అపహరించుకెళ్లారు.
పలు ఇళ్లలో చోరీలు
రూ.8 లక్షలు విలువైన సొత్తు అపహరణ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ
ఒంగోలు క్రైం, జూలై 17(ఆధ్రజ్యోతి) : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలోని రాజీవ్‌నగర్‌లో నాలుగు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడి సుమారు రూ.8 లక్షలు విలువైన సొత్తును అపహరించుకెళ్లారు. ఒకే ప్రాంతంలో నాలుగు ఇళ్ల తాళాలు పగులు కొట్టి సొత్తు చోరీ చేయడం గమనార్హం. ఈ చోరీలకు పాల్పడింది ఒకే ముఠానా లేకా వేరువేరుగా ఉన్నారా అనేది సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
వరుస దొంగతనాలు
స్థానిక రాజీవ్‌నగర్ బ్రాహ్మణ వృద్ధాశ్రమానికి సంబంధించిన గదులలో అద్దెకు విప్పర్ల రాజ్యం కుటుంబం ఉంటోంది. బుధవారంరాత్రి పడుకునే సమయంలో ఇంటికి తాళం వేసి బిల్డింగ్ పైన పడుకున్నారు. గురువారం ఉదయం 4.30 నిద్ర లేచిచూడగా ఇంటి తాళం పగులకొట్టి ఉంది. బీరువా తలుపు పెకిలించి ఉంది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, రెండున్నర సవర బంగారం ఆభరణాలు, 100 గ్రాముల వెండి అపహరించుకెళ్లారు. సుమారు రూ.2.5 లక్షల విలువైన సొత్తు అపహరించుకెళ్లారు.
రాజీవ్‌నగర్ ప్రాంతంలో మోదేపల్లి శ్రీనివాసులు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. గురువారం ఉదయం చూసే సరికి ఇంట్లో దొంగలు తాళం పగుల కొట్టి చొరబడి రూ.20 వేలు నగదు, రెండున్నర సవర్ల బంగారు ఆభరణాలు, మూడుకిలోల వెండి సామగ్రి అపహరించుకెళ్లారు. సుమారు రూ 3.5 లక్షల విలువైన సొత్తును చోరీ చేశారు.
రాజీవ్ నగర్‌లోని అచ్చకాల శంకర్రావు ఇంటి తలుపు వేసి ఊరు వెళ్లారు. వారు వచ్చే సరికి ఇంటి తలుపు పెకిలించి రూ.70 వేలు నగదు ఎత్తుకెళ్లారు.
పచ్చవ వరలక్ష్మీ ఇంటి తాళం పగలు కొట్టి దొంగలు ప్రవేశించి సీిసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్‌ను అపహరించుకెళ్లారు.
నాలుగుఇళ్లలో సుమారు రూ.8 లక్షలు సొత్తు అపహరణకు గురైనట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు.
దిబ్బలరోడ్డులో భారీ చోరీ
స్థానిక దిబ్బలరోడ్డులోని పిండిమర సమీపంలో దగ్గుబాటి వెంకటసుబ్బారావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.25లక్షల విలువైన బంగారు సొత్తును దొంగలు అపహరిచుకెళ్లారు. వెంకటసుబ్బయ్య ప్రస్తుతం వీగ్రాండ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఈనెల 12న తన కుటుంబసభ్యులతో కలసి స్వగ్రామం పోరుమామిళ్ల వెళ్లారు. గురువారం ఉదయం వారు ఇంటికి బయిలుదేరారు. అదేసమయంలో ఇంటి పక్కన ఉన్న వారు తలుపులు తెరిచి ఉన్నాయని ఫోన్ ద్వారా వెంకటసుబ్బయ్యకు తెలిపారు. దీంతో వారు గురువారం మధ్యాహం వచ్చి చూసే సరికి ఇంటితాళం పెకిలించి ఉంది. బీరువా తాళం పగలగొట్టి సుమారు 225 గ్రాములు బంగారం ఆభరణాలు, రూ.1.85 లక్షలు నగదును దుండగులు చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని తాలుకా సీఐ విజయకృష్ణ, తన సిబ్బందితో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.