దోర్నాలలో దొంగలు హల్‌చల్
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:03 PM
దోర్నాలలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. 4 ఇళ్లల్లో చోరీకి యత్నించి ఒకరి ఇంట్లో రూ.2,50,000 నగదు, 26 తులాల బంగారు నగలు, బైక్‌ను అపహరించుకుపోయిన ఘటన ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది.
నాలుగు ఇళ్లల్లో చోరీకి యత్నం.. క్లూస్ టీం పరిశోధన
26 తులాల బంగారు నగలు, రూ.2.50లక్షల నగదు, బైక్ అపహరణ
పెద్దదోర్నాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : దోర్నాలలో బుధవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. 4 ఇళ్లల్లో చోరీకి యత్నించి ఒకరి ఇంట్లో రూ.2,50,000 నగదు, 26 తులాల బంగారు నగలు, బైక్‌ను అపహరించుకుపోయిన ఘటన ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు.. ఇందిరానగర్‌లో నివాసితులు లేని ఇళ్లను ఎంచుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఇరుగుపొరుగు వారు గురువారం ఉదయం పక్కనున్న ఇళ్ల తలుపులు బార్లా తీసి ఉండడం గమనించి పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకట రమణయ్య వెళ్లి పరిశీలించారు. ఇళ్ల యజమానులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో రమేష్, సుబ్బయ్య, బాలకృష్ణ ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చి తమ ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేదని తెలిపారు. కాగా పల్లా శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి 15రోజులపాటు నరసరావుపేట బంధువుల వద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో రెండు బీరువాలను పగులగొట్టి వస్తువులను చిందరవందర చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు శివకుమార్ వచ్చి చూడగా బీరువాలో 26తులాల బంగారు నగలు, రూ.2,50,000 నగదు పోయినట్లు తెలిపారు. ఇందిరానగర్‌లో నివాసముంటున్న షేక్ బాదుల్లా ఇంటి బయట ఉన్న బైకును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్లూస్‌టీం పరిశీలన
నాలుగు గృహాల్లో ఒకేరోజు దొంగలు పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీఐ అజయ్‌కుమార్ ఒంగోలు నుంచి క్లూస్ టీంను రప్పించి పరిశీలించారు. ఆ వీధికి సమీపంలో మరో వీధిలో ఎంపీపీ గృహానికి ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.ఇద్దరు అగంతకులు మంకీ క్యాప్‌ను ధరించి ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు చోరీకి రావడం, తిరిగి గం.1.44నిమిషాలకు వెళ్లడం సీసీ కెమెరాలో నమోదైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.