ఆయిల్ దందాలో ఆరితేరారు!
ABN , Publish Date - Dec 13 , 2025 | 02:24 AM
గెలాక్సీపురి కేంద్రంగా ఇండస్ట్రియిల్ మిక్స్‌డ్ ఆయిల్ దందా కొనసాగుతోంది. మూడేళ్లగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడేళ్ల క్రితం అంటే 2022-23లో చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టు పనులకు గ్రానైట్ రాళ్లు రోజుకు వందల సంఖ్యలో లారీలతో తరలించారు.
మూడేళ్లుగా ఇండస్ట్రియల్ మిక్స్‌డ్ ఆయిల్ అక్రమ రవాణా
లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లించకుండా ఖజానాకు భారీగా గండి
చీమకుర్తి ప్రాంతంలో నాలుగు పాయింట్‌లు
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
ఒంగోలు క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : గెలాక్సీపురి కేంద్రంగా ఇండస్ట్రియిల్ మిక్స్‌డ్ ఆయిల్ దందా కొనసాగుతోంది. మూడేళ్లగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూడేళ్ల క్రితం అంటే 2022-23లో చీమకుర్తి నుంచి రామాయపట్నం పోర్టు పనులకు గ్రానైట్ రాళ్లు రోజుకు వందల సంఖ్యలో లారీలతో తరలించారు. ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ మిక్సిడ్ ఆయిల్ అక్రమ తరలింపు ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ఒక ట్యాంకర్(20 వేల లీటర్లు) చొప్పున నెలకు 30 ట్యాంకర్లు అంటే సుమారు 6లక్షల లీటర్ల ఆయిల్ అక్రమంగా తరలించినట్లు అంచనా. అందుకు సంబంధించి కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లించకుండా ఈ దందా జరిగిందని అధికారులు ప్రాఽథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఆయిల్ సరఫరాకు సంబంధించి చెన్నైలో రాజమణికి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తే ఈ దందా బట్టబయిలు అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు ఇంత భారీగా రాజమణికి ఇండస్ట్రియల్ ఆయిల్ ఎక్కడ నుంచి వస్తుందనే కోణంలో కూడా విచారణ చేపట్టాల్సి ఉంది.
డొంక కదిలింది ఇలా...
రెండు ఆయిల్ ట్యాంకర్లు చీమకుర్తి వెళుతుండగా సంతనూతలపాడు సమీపంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఆ లారీలలో ఇండస్ట్రియల్ మిక్సిడ్ ఆయిల్ ఒంగోలుకు చెందిన ఏల్చూరి శ్రీనివాసరావు పేరుతో చీమకుర్తికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మిక్స్‌డ్ ఆయిల్ లీటర్ 86 రూపాయలుకు దొరుకుతుండడంతో టిప్పర్లతోపాటు క్వారీల యజమానులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. చెన్నైలో 70 రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.83 నుంచి రూ.86కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏల్చూరి శ్రీనివాసరావు 2022లో శ్రీనివాస లూబ్స్ పేరుతో జీఎస్టీ అనుమతులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎన్ని ట్యాంకర్లు చెన్నై నుంచి ఒంగోలుకు దిగుమతి చేసుకున్నాడు అనేది పరిశీలిస్తే అక్రమ దందా వ్యవహారం బట్టబయలు అవుతుంది. రెండు ట్యాంకర్లు ఆయిల్ అంటే(40వేల లీటర్లు) కు కేవలం 15 వేల లీటర్లకు జీఎస్టీ చెల్లించి అక్రమ రవాణా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే ఒక్క రోజు సుమారు రూ.2.70 లక్షలు జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ రవాణాకు పాల్పడ్డారు.
మిక్స్‌డ్ ఆయిల్ ఎందుకు వినియోగిస్తారు
ఇండస్ట్రియల్ మిక్సిడ్ ఆయిల్‌ను వాహనాలకు వినియోగించకూడదు. వాడితే ఎక్కువ పొగ, కార్బన్ అవశేషాలు వెలువడతాయి. పర్యావరణం దెబ్బతినడంతో పాటు వాహనాలు త్వరగా మరమ్మతులకు గురవుతాయి. ఆ ఆయిల్‌ను పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. టెక్స్‌టెల్స్, ఫుడ్, కెమికల్ పరిశ్రమలలో బాయిలర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. ఇంకా హాట్ వాటర్ జనరేటర్లకు ఉపయోగిస్తారు. అలాంటి ఇంధనం అక్రమంగా తరలించి లారీలు, టిప్పర్లు, క్వారీలో వినియోగించే వాహనాలకు వినియోగిస్తున్నారు.
అక్రమ దందాను పట్టించుకోని అధికారులు
మూడేళ్ళగా అక్రమంగా ఇండస్ట్రియల్ ఆయిల్ చెన్నై నుంచి జిల్లాకు తరలిస్తుంటే పౌరసరఫరాల విభాగం కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా వందలాది ట్యాంకర్లకు జీఎస్టీ చెల్లించకుండా అక్రమంగా తరలిస్తుంటే జీఎస్టీ అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఈ అక్రమ దందాపై విజిలెన్స్ అధికారులు కదిలే వరకు.. పర్యవేక్షించాల్సిన శాఖలు పట్టించుకోకపోవడం వెనుక భారీగా నగదు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చీమకుర్తి ప్రాంతంలో జోరుగా అమ్మకాలు
చీమకుర్తి ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు గుర్తించింది నారాయణకు సంబంధించిన దందా మాత్రమే. ఇంకా నాలుగు ప్రాంతాలలో ఇలాంటి అక్రమంగా ఆయిల్ నిల్వ ఉంచి విక్రయాలు చేసే పాయింట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే ఈ దందాలో పాత్రధారులు పెరిగే అవకాశం ఉంది.