లక్షకు మూడు లక్షలు వస్తాయని...
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:41 PM
ఇద్దరు వ్యక్తులు అత్యాశకు పోయారు. లక్షలకు మూడు లక్షలు సంపాదించవచ్చని భావించి ఏకంగా రూ.8లక్షలు పొగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అత్యాశకు పోగా మొదటికే మోసం
రూ.8లక్షలు పోగొట్టుకున్న బాధితులు.. కారంపూడిలో కేసు
త్రిపురాంతకం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఇద్దరు వ్యక్తులు అత్యాశకు పోయారు. లక్షలకు మూడు లక్షలు సంపాదించవచ్చని భావించి ఏకంగా రూ.8లక్షలు పొగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించి తెలిసిన వివరాలు ఇలా.. త్రిపురాంతకానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అక్కడి వ్యక్తి తనవద్ద నకిలీ కరెన్సీ ఉందని లక్షకు మూడు లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. అధిక లాభం పొందవచ్చని ఆశపడిన ఆ ఇద్దరు తమ వద్ద ఉన్న రూ.8లక్షలు తీసుకెళ్లి అక్కడి వ్యక్తికి ఇచ్చేందుకు వెళ్లగా చిన్నగార్లపాడు సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఇక్కడ రహస్యంగా లెక్కించుకోవచ్చని వారిని మభ్యపెట్టి ఆ డబ్బుతో ఉడాయించినట్టు తెలిసింది. దీంతో అసలుకే ఎసరు వచ్చిందని లబోదిబోమంటూ బాధితులు కారంపూడి పోలీసులను ఆశ్రయించి మోసగాడి పేరు శ్రీను అని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడి పేరు సతీష్ తండ్రి పుల్లారావుగా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో నమోదై ఉంది. ఈ ఉదంతంపై తమకు ఎటువంటి సమాచారం లేదని త్రిపురాంతకం ఎస్‌ఐ శివబసవరాజు తెలిపారు. ఈ విషయాన్ని పల్నాడు పోలీసులు సీరియ్‌సగా విచారణ జరుపుతూ ఈ వ్యాపారం ఎలా ఎప్పుడెప్పుడు జరిగిందనే కోణంలో చూస్తున్నట్టు తెలిసింది.