Share News

అన్నగారంటూ... దోచేశారు!

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:47 AM

గత వైసీపీ పాలనలో ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేసిన అధికారి ప్రజాప్రతినిధుల నుంచి, తన పై అధికారుల వరకు అందరినీ అన్నగారూ అంటూ ఆకట్టుకున్నారు. మంచి మాటకారిగా పేరు ఉన్న ఆయన అవినీతిలో ఆరితేరారు. ఆయనకు సహకరించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి (ప్రస్తుతం రిటైర్డ్‌) చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

అన్నగారంటూ... దోచేశారు!
ఒంగోలులోని పప్పు బజారులో కనీసం సెట్‌ బ్యాక్‌ కూడా లేకుండా నిర్మించిన భవనం

వైసీపీ హయాంలో అక్రమ కట్టడాలకు ఆయన ఆశీస్సులులు

అపార్ట్‌మెంట్‌ల నుంచి ఆసుపత్రుల వరకు అడ్డగోలుగా అనుమతులు

ఓ విల్లాకు తక్కువ పన్ను విధింపునకు భారీగా ముడుపులు

కార్పొరేషన్‌ ఖజానాకు భారీగా గండికొట్టిన మాజీ కమిషనర్‌

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు

గత వైసీపీ పాలనలో ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేసిన అధికారి ప్రజాప్రతినిధుల నుంచి, తన పై అధికారుల వరకు అందరినీ అన్నగారూ అంటూ ఆకట్టుకున్నారు. మంచి మాటకారిగా పేరు ఉన్న ఆయన అవినీతిలో ఆరితేరారు. ఆయనకు సహకరించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి (ప్రస్తుతం రిటైర్డ్‌) చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రూ.వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్లలో అవినీతి జరిగినట్లు సమాచారం. ఆదాయ వనరులు అధికంగా ఉండే విభాగంలో తనదైన పాత్ర పోషించి, టౌన్‌ ‘ప్లానింగ్‌’నే మార్చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదును దోచేసి, సొంత ప్లానింగ్‌లు ఇచ్చేసి భారీగా స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగి పలు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకోవడంతో వాస్తవాలు బయటపడుతున్నాయి.

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో ఒంగోలు నగర పాలక సంస్థలో ‘అన్నగారు..’ హయాంలో అవినీతి అడ్డూఅదుపు లేకుం డా సాగింది. అక్రమాలకు పునాదులు పడ్డాయి. ఆ అధికారి చెప్పిందే వేదంగా ఫైళ్లు కదిలాయి. అంతా తానై నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా కార్పొరేషన్‌లో అనుమతులు ఇచ్చేశారు. అప్పటి వైసీపీ పెద్దల ఆదేశాలు.. కొందరు ఉన్నతాధికారుల ఆశీస్సులతో కార్పొరేషన్‌ ఖజానాకు భారీగానే గండికొట్టారు. అపా ర్ట్‌మెంట్‌ల నుంచి అసుపత్రుల నిర్మాణాల వరకు నిబంధనలకు నీళ్లొదిలారు. 38 ఎకరాలలో నిర్మిస్తున్న విల్లాలకు సంబంధించి కిరికిరి చేసి పన్ను తగ్గించి భారీగా ముడుపులు తీసుకున్నారు.

నిబంధనలు ఒకలా.. అనుమతులు మరొకలా..!

నగరంలో గత పదేళ్ల నుంచి అపార్ట్‌ మెంట్‌ రంగానికి ఆదరణ పెరిగింది. బహుళ అంతస్థులు భారీగా నిర్మాణం చేపట్టారు. గతంలో నడిబొడ్డుకే పరిమితమైన అపార్ట్‌మెంట్లు శివార్లకువిస్తరిస్తున్నాయి. దీంతో నగరంలో చాలామంది బిల్డర్ల అవతారం ఎత్తారు. ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి 60+40 పద్ధతిన నిర్మాణాలు చేపట్టారు. అప్పటివరకు స్థానికంగా ఉండే కొందరు ప్రముఖులు బిల్డర్లుగా వ్యవహరిస్తుండగా, తాజాగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పలు వురు నగరంలో అపార్ట్‌మెంట్‌ రంగంలో అడుగుపెట్టారు. దీంతో వారి మధ్య పోటీ పెరిగింది. 50+50 విధానంతో వ్యాపారాలు మొదలయ్యాయి. దీంతో లాభాల కోసం ప్రభుత్వం ఆదేశించిన ప్రమాణాలను విస్మరించి ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించారు. అలాంటి సమయంలో ప్రత్యేక దృష్టిపెట్టి నిబంధనలు పాటించేలా చూడాల్సిన కార్పొరేషన్‌ అధికారులు ఇదే అదనుగా మామూళ్ల దందాతో రెచ్చిపోయారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో ఫ్లోర్‌కు రూ.10లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు నగరంలో వెయ్యికిపైగా అపార్ట్‌మెంట్‌లు ఉండగా, సగానికిపైగా ‘అన్నగారు’ అనుమతులిచ్చినవే అని తెలుస్తోంది.మరోవైపు డీకే పట్టాలలో బిల్డింగ్‌ నిర్మాణాలకు ప్లాన్‌ పొందే అవకాశం లేకపోవడంతో వాటిని ఆసరాగా చేసుకుని నేరుగా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు సమాచారం. మొత్తంగా ఒంగోలులో గత వైసీపీ పాలనలో కమిషనర్‌గా పనిచేసిన అధికారి, ఆయనకు సహకరించిన వారు భారీగానే దోచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అపార్ట్‌మెంట్‌ల నుంచి ఆసుపత్రుల వరకు

అన్నగారు పలు ప్రభుత్వ శాఖల్లో కీలక అధికారిగా ఇరవై ఏళ్లకుపైగా ఒంగోలుతోపాటు, చుట్టుపక్కల మండలాల్లోనే పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలతో సత్సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పడు కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన పెద్దలు కనిపిస్తే కాళ్ళ మీద పడటం, పలకరిస్తే అన్నగారూ అంటూ అందరినీ మాయ చేయడంలో దిట్ట అని అందరికీ తెలిసిన విషయం. దీంతో వైసీపీ హయాంలో ఆయనకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అపార్టుమెంట్ల నుంచి ఆసుపత్రుల వరకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేశారు. వైసీపీ పెద్దలు, ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారి ఆదేశాలు రావడం ఆలస్యం, అదే అవకాశంగా భారీగానే గుంజేసేవారని తెలుస్తోంది. అందులోభాగంగానే పెళ్లూరు వైపు వెళ్లే జాతీయ రహదారిలో ఓ ఆసుపత్రికి అనుమతులు ఇవ్వడంతోపాటు, నెల్లూరు బస్టాండ్‌లోని ఓ పేరున్న హోటల్‌కు ఆయన ఆశీస్సులు పుష్కలంగానే ఉన్నాయని తెలుస్తోంది.

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

భవన నిర్మాణ రంగంలో పేరున్ను ఓ సంస్థ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌-1 వద్ద నిర్మిస్తున్న పాత బైపాస్‌ రోడ్డులో నిర్మిస్తున్న విల్లాలకు అనుమతుల కోసం భారీగా నొక్కేశారని తెలుస్తోంది. వాస్తవానికి 38 ఎకరాలలో 21 మందికి సంబంధించిన ఆ స్థలంలో విల్లాలు నిర్మిస్తుండగా, కేవలం ఇద్దరు ఆస్తులకు మాత్రమే పన్ను విధించి, ఆ స్థలం మొత్తానికి ప్లాన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.కోట్లల్లోనే కార్పొరేషన్‌ ఖజానాకు గండిపడిందని విజిలెన్స్‌ విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే శర్మా కాలేజీ సమీపంలో నిర్మించిన మరో అపార్ట్‌మెంట్‌లోనూ నిబంధనల ఉల్లంఘనకు ఆయన తనవంతు సహకారం అందించి ఆ యజమానుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒంగోలు కమిషనర్‌గా నగర అభివృద్ధి గురించి పట్టించుకోని ఆయన అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కమిషనర్‌, ఏసీపీ అవినీతి పునాదులు. అక్రమ కట్టడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం నగరంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది

Updated Date - Sep 21 , 2025 | 02:47 AM