సంక్షేమం పేరుతో దోచేశారు!
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:20 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం పేరును అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని అడ్డగోలుగా దోచేశారని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో గిద్దలూరు, కంభం మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా అవినీతి
నాసిరకం మద్యంతో ఎంతోమంది ప్రాణాలు తీశారు
విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి
ఘనంగా గిద్దలూరు, కంభం ఏఎంసీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
గిద్దలూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం పేరును అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని అడ్డగోలుగా దోచేశారని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో గిద్దలూరు, కంభం మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ వైసీపీ పాలనలో నాసిరకం మద్యం ప్రవేశపెట్టి ఎంతో మంది చనిపోయేందుకు, వేల మంది రోగాలబారిన పడేందుకు కారణమయ్యారని విమర్శించారు. అంతేగాక వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేపడుతూనే ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోందన్నారు. ఇంత చేస్తున్నా వైసీపీ నాయకులు వారు చెప్పే అబద్ధాలను నిజం చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లోకి వెళుతూ కలుషితం చేస్తున్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో 64 లక్షల మందికి ఏటా రూ.34వేల కోట్లతో పింఛన్లు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. తల్లికి వందనం కింద దాదాపు రూ.10వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా 16,300కుపైగా ఉద్యోగాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పవర్‌లూమ్స్‌కు 50 యూనిట్ల వరకు, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 190 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే బార్బర్ షాపులకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. లోవోల్టేజీ సమస్య పరిష్కారం కోసం వై.పాలెం నియోజకవర్గంలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేశామన్నారు. గిద్దలూరులో కూడా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఉత్పత్తిని పెంచకుండా కమీషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్‌ను కొనుగోలు చేసిందని, 9 పర్యాయాలు ప్రజలపై భారం మోపిందని మంత్రి విమర్శించారు. ప్రజాప్రభుత్వం రాగానే విద్యుత్ బిల్లులు పెంచకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోలార్, విండ్ విద్యుత్‌ను పెంచుతున్నామని చెప్పారు.
వెలిగొండ పూర్తికి కట్టుబడి ఉన్నాం : మంత్రి స్వామి
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ గిద్దలూరు నుంచి బుగ్గ వరకు 4 లైన్ల రహదారి నిర్మాణానికి రూ.4,200 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. బేస్తవారపేట నుంచి ఒంగోలు వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చని, త్వరలో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జగన్‌ను ఫేక్ సీఎంగా అభివర్ణించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాధారమే దిక్కయిన ఈ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగునీటి అవకాశాలు తీరతాయన్నారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది, త్వరలో నీళ్లు ఇవ్వబోయేది చంద్రబాబేనని స్పష్టం చేశారు. మార్కాపురం కేంద్రంగా త్వరలో కొత్త జిల్లాగా రాబోతుందన్నారు. గిద్దలూరు, కంభం మార్కెట్ కమిటీ చైర్మన్లుగా బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్లుగా, ఇతర డైరెక్టర్లతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి, చీరాల ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఎం.ఎం.కొండయ్య, వై.పాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, దర్శి నాయకుడు డాక్టర్ లలిత్‌సాగర్, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్, మునిసిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, జనసేన ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.వి.నారాయణ పాల్గొన్నారు.