Share News

అలా వదిలేశారు!

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:23 PM

గత ఐదేళ్ల వైసీపీ పాలకుల నిర్వాకం వలన నేడు ఒంగోలు కార్పొరేషన్‌ ఖజానాకు భారీగానే గండి పడింది. కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని దుకాణాలకు సంబంధించి సుమారు రూ.27కోట్ల మేర అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆస్తులు పరుల చేతుల్లోకి వెళ్లాయి. కొందరు వ్యాపారులు బినామీలుగా తిష్ట వేయగా, నాటి పాలకుల అండదండలతో షాపులు దక్కించుకుని కొందరు కార్పొరేషన్‌కు అద్దెలు చెల్లించకుండా అడ్డం తిరుగుతున్నారు.

అలా వదిలేశారు!
ఒంగోలు నగర పరిధిలో ఉన్న మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

వైసీపీ పాపం.. ఖజానాకు శాపం..!

కార్పొరేషన్‌ దుకాణాలకు పేరుకుపోయిన అద్దె బకాయిలు

కూరగాయల మార్కెట్‌లో రూ.12 కోట్లు!

షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నుంచి రూ.15కోట్లు పెండింగ్‌

లీజు గడువు పూర్తయినా పట్టించుకోని వైనం

ఇతరులకు అమ్ముకొన్న కొందరు

కార్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండి

చోద్యంచూస్తున్న రెవెన్యూ విభాగం

గత ఐదేళ్ల వైసీపీ పాలకుల నిర్వాకం వలన నేడు ఒంగోలు కార్పొరేషన్‌ ఖజానాకు భారీగానే గండి పడింది. కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని దుకాణాలకు సంబంధించి సుమారు రూ.27కోట్ల మేర అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వ ఆస్తులు పరుల చేతుల్లోకి వెళ్లాయి. కొందరు వ్యాపారులు బినామీలుగా తిష్ట వేయగా, నాటి పాలకుల అండదండలతో షాపులు దక్కించుకుని కొందరు కార్పొరేషన్‌కు అద్దెలు చెల్లించకుండా అడ్డం తిరుగుతున్నారు. పలువురు ఏకంగా దుకాణాలను అమ్ముకున్నారు. అలాంటి వారి నుంచి ఇప్పుడు అద్దె బకాయిలు వసూలు చేయడం తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల షాపుల లీజు గడువు పూర్తయినప్పటికీ దర్జాగా అనుభవిస్తున్నారు. గతంలో కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగంలో పనిచేసిన వారి కాసుల కక్కుర్తి కూడా ఈ పరిస్థితికి కారణమైంది.

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌, ఇతర షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించి దీర్ఘకాలికంగా పేరుకుపోయిన బకాయిలపై ఇటీవల రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా అవాక్కయ్యే నిజాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లుగా అద్దె వసూళ్లు, దుకాణాల పర్యవేక్షణ గాలికొదిలేసినట్లు తేలింది. ఒక్క దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లోనే సుమారు రూ.12 కోట్లు బకాయిలు బయటపడ్డాయి. మిగిలిన మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల బకాయిలు మరో రూ.15 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. గతంలో అద్దెలు చెల్లించిన సొమ్మును కొందరు ఆర్‌ఐలు తమ సొంతానికి వాడుకోగా, మరికొందరు దుకాణదారులు అసలు అద్దెలు చెల్లించకుండానే దర్జాగా అనుభవిస్తున్నారు.

ప్రభుత్వ షాపులను అమ్మేసుకున్నారు!

కార్పొరేషన్‌ కాంప్లెక్స్‌ల్లో గతంలో షాపులు దక్కించుకున్న వారిలో కొందరు వాటిని అమ్మేకుసుకున్నారు. ఇప్పుడు వారి నుంచి అద్దె బకాయిలు రాబట్టడం కష్టతరంగా మారింది. షాపులు అమ్ముకున్న వారి పేరుతోనే నేటికీ బకాయి ఉండగా, తమకు సంబంధం లేదని కొందరు తెగేసి చెప్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దుకాణాల విక్రయాలు జోరుగా సాగినా పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఆస్తులను ఎలా అమ్ముతారు? అని ప్రశ్నిస్తున్న అధికారులు చర్యలకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. మరికొందరు నాటి వైసీపీ పెద్దల ఆశీస్సులతో షాపులు దక్కించుకుని అద్దెలు చెల్లించకుండా దర్జాగా అనుభవిస్తున్నారు. దీంతో కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దె వసూళ్లు అధికారులు తలనొప్పిగా మారింది.


గడువు పూర్తయినా కదలని లీజుదారులు

కొన్ని షాపులను అధికారులు లీజు పద్ధతిన కేటాయించారు. అప్పట్లో లీజు పొందిన వారు గడువు పూర్తయినా కదలనంటున్నారు. అమరజీవి మునిసిపల్‌ షాంపింగ్‌ కాంప్లెక్స్‌లో 25 షాపులు, అద్దంకి బస్టాండ్‌ మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 25, టీఎల్‌ఎన్‌ షాపింగ్‌ పాంప్లెక్స్‌లో 12, జయరాం హాలు సమీపంలో మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 3, లాయరుపేట మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 40 దుకాణాలు, ఘోష ఆసుపత్రి మునిసిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 15 షాపులు 25 సంవత్సరాల లీజు పద్ధతిన కేటాయించారు. కూరగాయాల మార్కెట్‌లో ఐదు సంవత్సరాల లీజు పద్ధతిన హోల్‌ సేల్‌ షాపులు 69, రిటైల్‌ షాపులు 123, పండ్ల దుకాణాలు 38, పూల దుకాణాలు 28, చేపల దుకాణాలు 25, మాంసం మార్కెట్‌లో 25 షాపులను కేటాయించారు.

ఏళ్ల తరబడి తిష్ట

25 సంవత్సరాల లీజుకు తీసుకున్న కొన్ని కాంప్లెక్స్‌లోని షాపులకు 2022 నాటికి గడువు పూర్తయ్యింది. వాటిని రెన్యువల్‌ చేయకుండా గతంలో పనిచేసిన కార్పొరేషన్‌ ఆర్‌ఐలు కప్పిపెట్టారు. కూరగాయల మార్కెట్‌లో షాపులను 30శాతం అద్దె పెంపుతో రెన్యువల్‌ చేయాల్సి ఉండగా అది కూడా జరగలేదు. గడిచిన ఐదేళ్లుగా అద్దె బకాయిల వసూలు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గుర్తుకు వచ్చినప్పుడల్లా మొక్కుబడి నోటీసులతో సరిపెట్టిన రెవెన్యూ యంత్రాంగం నేటికీ దుకాణాలను స్వాధీనం చేసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగం వారు దుకాణాల నిర్వాహకుల నుంచి అద్దె వసూలు చేసి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. నాలుగు నెలల క్రితం సదరు ఆపరేటర్‌ సీటు మార్చడంతో ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. దీంతో లెక్కాపక్కా లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అద్దె బకాయిలు వసూలు చేయడంతోపాటు, లీజు ముగిసిన షాపులను స్వాధీనం చేసుకోవడం కానీ, రెన్యువల్‌ కానీ చేసి కార్పొరేషన్‌ ఖజానాకు ఆర్థిక పరిపుష్టి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:23 PM