Share News

అలా వదిలేశారు!

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:30 AM

తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖను శాసించాడు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన విద్యుత్‌శాఖ పనులన్నీ అతని కనుసన్నల్లోనే నడిచాయి.

అలా వదిలేశారు!
కండక్టర్‌ వైరు బిగించని విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ శాఖలో వైసీపీ కాంట్రాక్టర్‌దే పెత్తనం

అతని నిర్వాకంతో మూడేళ్లుగా నిలిచిన పనులు

అప్పట్లో మెటీరియల్‌ను సొంతానికి వాడుకున్నా చర్యలు శూన్యం

గతంలో మార్కాపురం నేతకు ముఖ్య అనుచరుడిగా హవా

ప్రభుత్వం మారినా పట్టించుకోని ఆ శాఖ అధికారులు

ఉన్నతాధికారులు దృష్టిసారించాలంటున్న ప్రజలు

అతనో గ్రామస్థాయి వైసీపీ నాయకుడు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడు. విద్యుత్‌ కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తాడు. ముఖ్య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నియోజకవర్గవ్యాప్తంగా ఆ శాఖలో అతను చెప్పిందే వేదంగా నడిచింది. చట్టాలను, నియమాలను ఉల్లంఘించి ఎన్ని తప్పులు చేయాలో అన్నీ చేశాడు. కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్లతో చేయాల్సిన కీలకమైన పనిని కూడా నిబంధనలకు విరుద్ధంగా తన పలుకుబడిని ఉపయోగించి దక్కించుకున్నాడు. ఈక్రమంలో ప్రభుత్వ పనులకు వచ్చిన సామగ్రి సొంతానికి వాడుకున్నాడు. ఆ మెటీరియల్‌ను కిందిస్థాయి సిబ్బందే చోరీ చేసినట్లు నెపాన్ని వారిపై మోపాడు. ఆ క్రమంలో చివరికి మండల ఏఈపైన రికవరీ భారం పడింది. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటుతున్నా నేటికీ పూర్తిచేయలేదు. వైసీపీ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అధికారులు మాత్రం అతనిపై కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మార్కాపురం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు మండలంలోని మీర్జాపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ శాఖను శాసించాడు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన విద్యుత్‌శాఖ పనులన్నీ అతని కనుసన్నల్లోనే నడిచాయి. ఎవరైనా ఎదురుచెబితే వారిని ఇబ్బందులకు గురిచేయడం అతని నైజం. మండలం నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అతని పేరు చెబితే హడలిపోయే పరిస్థితులు అప్పట్లో నెలకొన్నాయి. మార్కాపురం పట్టణానికి రెగ్యులర్‌ ఏఈ పోస్టును వైసీపీ ప్రభుత్వ హయాం మొత్తంలో నియమించకుండా అడ్డుకున్నాడంటే అతని స్థాయి ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణ పనులు చేయకపోయినా ఉన్నతాఽధికారులతో అతనికి ఉన్న సత్సంబంధాలతో ప్రస్తుతం సూర్యఘర్‌ యోజన పనులు చేస్తున్నాడు. గత ఐదేళ్లలో అతను చేసిన అకృత్యాలను ప్రభుత్వం మారినా నేటికీ ప్రశ్నించలేకపోవడం గమనార్హం.

ప్రభుత్వ కేబుల్‌ చోరీ చేసి మూడేళ్లు.. ఆపై పనులు నిలిపివేత

నిరంతర విద్యుత్‌ సరఫరాకు కొనకనమిట్ల మండలం చౌటపల్లి నుంచి తర్లుపాడు మండలం మేకలవారిపల్లి సబ్‌స్టేషన్ల మధ్య నూతన విద్యుత్‌లైన్‌ పనులను 2022లో ఆ శాఖ చేపట్టింది. ఇలాంటి కీలకమైన పనులను కన్‌స్ట్రక్షన్‌ విభాగం ద్వారా ఆ శాఖ రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో ఉండే పెద్ద కాంట్రాక్టర్లకు అప్పజెబుతుంటుంది. అప్పట్లో అధికారం అండతో ఆపరేషన్స్‌ విభాగంలో కాంట్రాక్టర్‌ అయిన అతను రూ.10 లక్షల పనిని దక్కించుకున్నాడు. తొలుత రెండు సబ్‌స్టేషన్ల మధ్య విద్యుత్‌ స్థంభాలను ఏర్పాటు చేశాడు. మిగిలిన పనిని రెండు మాసాల్లోనే పూర్తిచేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. కానీ ఆ కాంట్రాక్టర్‌కు దుర్భుద్ది పుట్టింది. మార్కాపురం మండలంలో ప్రైవేటు పనిని కూడా చేస్తున్న అతను ప్రభుత్వ పనులకు వచ్చిన రూ.2లక్షల విలువైన కేబుల్‌ను మాయం చేశాడు. చౌటపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఉన్న ఆ కండక్టర్‌ వైర్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చోరీ చేసినట్లు వారిపై చర్యలు తీసుకునేలా చక్రం తిప్పాడు. దీంతో సుమారు ఏడాది పాటు పనులు నిలిచిపోయాయి. జిల్లా ఉన్నతాధికారులు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, మండల ఏఈలపై రికవరీ భారాన్ని మోపారు. ఈ వ్యవహారంలో సదరు కాంట్రాక్టర్‌ నాయకున్ని అడ్డం పెట్టుకుని వ్యవహారం నడిపాడు. సరే రికవరీ అయిన తర్వాతైనా పనులు పూర్తి చేశాడా అంటే అదీ లేదు. వైసీపీ అఽధికారంలో ఉన్నన్నాళ్లు ఆ పనిచేయకుండా తప్పించుకుని తిరిగాడు. 2024లో టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ శాఖలో ఎలాంటి పనులు చేయడంలేదు. అత్యంత కీలకమైన పనే అయినా అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టిపెట్టడంలేదు.

Updated Date - Jun 10 , 2025 | 01:30 AM